కేసిఆర్ వైఫల్యాలను ఎండగడుతాం
– బిజెపితోనే అభివృద్ది సాధ్యం
– మహాకూటమి ఓ బోగస్‌కూటమి
– ఏం చేశారని ఓట్లగుతున్నరు
– బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు వెల్లడి
గోదావరిఖని, నవంబర్ 18, (జనంసాక్షి) :
అపద్దర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు వైఫల్యాలను ఎండగడుతామని, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రానికి చేసిందేమిలేదని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం గోదావరిఖనిలో వివిధ ఏరియాల్లో నిర్వహించిన రోడ్-షోలలో ఆయన మాట్లాడారు. బిజెపితోనే అభివృద్ది సాధ్యమన్నారు. ఏం అవసరం ఉందని ముందుస్తు ఎన్నికలకు కెసిఆర్ వెళ్లారని ప్రశ్నించారు. ఎలాంటి అభివృద్ది సాధించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ ద్రోహం చేశాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేడని, ప్రజాసమస్యలను విస్మరించిన వారు చరిత్రహీనులైతారని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితున్ని సీఎం చేయడం, డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పిన కెసిఆర్ వాటిని విస్మరించినట్టు చెప్పారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా మలుచుకుని ప్రచారం నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రతి విషయంలో వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు.
మహాకూటమి అదో బోగస్ కూటమి అన్నారు. మహాకూటమితో ఒరిగేది ఏంలేదన్నారు. అధికారం కోసం మహాకూటమి నాయకులు తహతహలాడుతున్నారని విమర్శించారు. మహాకూటమిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహాకూటమిని నమ్మవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారం రావడం ఖాయమన్నారు. ప్రధానమంత్రి మోడి చరిష్మా పనిచేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారుస్తామన్నారు. రామగుండంలో బిజెపి అభ్యర్ధి బల్మూరి వనితను గెలిపించాలని కోరారు. కమలం గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి ముందు పట్టణంలో బిజెపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ మేడిపెల్లి సెంటర్‌లో ప్రారంభమైన రోడ్‌షో, బస్టాండ్ ఏరియా, గోదావరిఖని ప్రధానచౌరస్తా, ఫైవింక్లయిన్‌కాలనీ, తిలక్‌నగర్ తదితర ఏరియాల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బిజెపి రామగుండం అభ్యర్ధి బల్మూరి వనిత, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, జిల్లా అధ్యక్షులు కాసిపేట లింగయ్య, బిజెపి, దాని అనుబంధ సంఘాల నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, బల్మూరి అమరెందర్‌రావు, రాజేందర్, రాంచందర్, పెద్దపల్లి రవీందర్, జక్కుల నరహరి, మూకిరి రాజు, మహావాది రామన్న, మాతంగి రేణుక, మారం వెంకటేశ్, ప్రతాప్‌సింగ్, పవన్, మామిడి రాజేశ్, రాంచందర్, కుమారస్వామి, దిగుట్ల లింగయ్య, సంతోష్‌కుమార్, మల్లేశ్‌గౌడ్, రాజేశ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.