కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన.. సమయం ఆసన్నమైంది
– నాలుగేళ్లు పూజలు చేస్తూ కాలం గడిపాడు
– మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టాడు
– కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు రెండూ ఓకే గూటి పక్షులు
– ఆరెండు పార్టీలు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయి
– తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే
– బీజేపీ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది
– దేశంలో పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆయుష్మాన్ పథకం తెచ్చాం
– కేసీఆర్ ఆ పథకాన్ని తెలంగాణలో అమలు కానివ్వలేదు
– నిజామాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
నిజామాబాద్, నవంబర్27(జనంసాక్షి) : నాలుగేళ్లు పాలన సాగించిన కేసీఆర్.. పేద ప్రజలకు చేసింది ఏవిూలేదని, కేసీఆర్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. నిజాం ఆగడాలను ఎదిరించిన చరిత్ర గల నేల ఇదని అన్నారు. అభివృద్ధిని ఆంకాక్షిస్తూ తెలంగాణ ప్రజలు బీజేపీతో కలిసి కదం తొక్కుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలగాణ ప్రజల కలలతో ఆడుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన ప్రధాని.. ఈ నాలుగేళ్లలో ప్రతీపైసాకు లెక్క అడిగే హక్కు ప్రజలకు ఉందన్నారు. పవిత్రమైన గోదావరి నీటిని తాగుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ దేవి కరుణా కటాక్షాలను పొందిన ఈ ప్రాంత ప్రజులు ఎంతో అదృష్టవంతులని అన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు మాలావత్, పూర్ణలు 13 ఏళ్ల ప్రాయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిందని చెప్పారు.
కామన్వెల్త్ పోటీల్లో పతకం సాధించిన మహమ్మద్ హుస్సేనుద్దీన్ ను కూడా మోదీ గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పటివరకూ తాను నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లానని, ఇప్పుడు తెలంగాణకు వచ్చానన్న అన్నారు. అన్ని రాష్టాల్లో అదే ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని తెలిపారు.
కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏపని కూడా పూర్తి చేయలేదని, ఆఖరికి ఐదేళ్లు పాలన కూడా పూర్తి చేయలేదని మోడీ ఎద్దేవా చేశారు. ముందస్తు ఎన్నికలతోనైనా ప్రజలకు ఈ ప్రభుత్వం నుంచి విముక్తి లభించనుండడం ఆనందించాల్సిన అంశంమన్నారు. ఇంటింటికీ గోదావరి నీళ్లు ఇస్తామని, లేని పక్షంలో ఓట్లు అడగడానికి రానని కేసీఆర్ అన్నారని గుర్తుచేసిన మోడీ, మరి మాట నిలుపుకోలేకపోయిన కేసీఆర్‌ను ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందన్నారు. పేద వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తే పరిస్థి ఎలా ఉంటుందో మనకు తెలుసని, కానీ, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే సరైన వైద్యం అందడం లేదని మోడీ అన్నారు. దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు వైద్యం కోసం ఆయుష్మాన్ యోజన తెచ్చామని, కానీ, అలాంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని ప్రధాని అన్నారు. కేసీఆర్ వైఖరితోనే ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ తరహాలోనే రాష్ట్రాన్ని పాలించొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
లండన్ ఏమైంది కేసీఆర్?
నిజామాబాద్‌ను లండన్‌లా మారుస్తామని కేసీఆర్ చెప్పారని, కానీ, కనీస సదుపాయాలు కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. లండన్ ఎలా అభివృద్ధి చేశారోనని నేను హెలికాప్టర్ నుంచి చూశానని, నిజామాబాద్ కనీస అభివృద్ధికి నోచుకోలేదని నాకు అర్థమైందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఎన్నో దశాబ్దాల ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఎంతో మంది యువకులు బలిదానాలు ఈ ఉద్యమం వెనకున్నాయని, వారి త్యాగాలను ప్రస్తుత పాలకులు వృథా చేస్తున్నారని, దీన్నిక సాగనివ్వబోమని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు చూసిన కలలు సాకారం కావడం లేదని, వాటిని నెరవేర్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు అయిందని, ఈ ప్రభుత్వం ఏం పని చేసిందని, ఇది ఎన్నికల సమయమని, ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయం పైసాపైసా లెక్క అడగాల్సిన సమయం ఇదన్నారు. ఇక్కడి యువత, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభ్యున్నతికి ఇచ్చిన హావిూల్లో ఏం నెరవేర్చారని ప్రశ్నించారు. ఏం అభివృద్ధి సాధించారో.. వాగ్ధానాల వైఫల్యంలో ప్రభుత్వం వైఫల్యంపై సమాధానం చెప్పి తీరాల్సిందేనని మోడీ అన్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులు ఏమనుకుంటున్నారంటే, దశాబ్దాలుగా ఏవిూ చేయని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ప్రభుత్వం స్థాపిస్తుంటే, తాము కూడా ఏవిూ చేయకుండానే గెలవచ్చని భావిస్తున్నారని మోడీ అన్నారు. అది ఎన్నటికీ జరగదని, జరగబోదని, కాంగ్రెస్ వారి అడుగుజాడల్లోనే ఇక్కడి సీఎం నడుస్తున్నారని, ఈ దేశం యువతదని, యువత బుద్ధి చెప్పే రోజు ఎంతో కాలంలో లేదని మోదీ అన్నారు.
ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు అవకాశం ఇస్తే, నాలుగున్నరేళ్లకే కేసీఆర్ తన అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వచ్చారని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని మోదీ అన్నారు. ఇచ్చిన హావిూలు నెరవేర్చని ప్రభుత్వ పీడను వదిలించుకునే అవకాశాన్ని ప్రభుత్వమే స్వయంగా ప్రజలకు దగ్గర చేసిందని
అన్నారు. కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చిందని విమర్శలు గుప్పించారు. త్వరలోనే ప్రజలకు టీఆర్‌ఎస్ పాలన నుంచి ముక్తి కలగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక్కడి మెడికల్ కాలేజీలు సరిగ్గా పనిచేయడం లేదని, అక్కడి విద్యార్థులు కష్టాలు పడుతున్నారని, మామూలు హాస్టల్ లో ఉన్న సౌకర్యాలు కూడా ఇక్కడ లేవన్నారు. ఈ సీఎం కేసీఆర్ ఎలా ఉన్నారంటే, జ్యోతిష్యం, జాతకాలు, నిమ్మకాయల దండలు, మిరపకాయలపై ఎంతో నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలే…
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రెండు పార్టీలూ కుటుంబ పార్టీలేనని మోడీ విమర్శించారు. పూజలు, యాగాల విూద పెట్టిన శ్రద్ద సీఎం కేసీఆర్ ప్రజల విూద పెట్టడం లేదని మండిపడ్డారు. బీజేపీ ది ఓకే మంత్రం సబ్ క సాత్ సబ్ కి వికాస్… ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ అభివృద్ధికి ఆటంకం అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒకప్పుడు యూపీఏలో మంత్రి… మేడం రిమోట్ కంట్రోల్ తో నడిచిన ప్రభుత్వంతో ఆయన పనిచేశారని అన్నారు. కాంగ్రెస్ తో తెలంగాణలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ప్రజల కోసం కృషి చేసి పార్టీ, కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమేనని ప్రధాని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ కుటుంబ పార్టీ అని, కేసీఆర్ పరివార్ వాదీ అన్నారు. కాంగ్రెస్ ది కూడా కుటుంబ పార్టీయేనని, మొన్న జరిగిన సభలో సోనియా, ఆయన కుమారుడు ఒకే వేదికపై ఉండి టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అని విమర్శించారని, అవి రెండూ కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు తేడా లేదని, నాణానికి రెండు వైపులా అన్నట్టుగా ఆ రెండు పార్టీలు ఉన్నాయని మోడీ ఆరోపించారు. అబద్దాలు ఆడడంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వంలో 6కోట్ల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తే అందులో తెలంగాణలో 5 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారన్నారు. నాలుగు లక్షల ఇళ్లకు తెలంగాణలో సౌభాగ్య పథకం కింద కరెంట్ కనెక్షన్ ఇచ్చామని తెలిపిన ప్రధాని… నిజామాబాద్ లో 15 వేల కనెక్షన్ లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలని, నేను తిననివ్వను అని చెప్పానన్నారు. కమిషన్ వ్యవస్థను రూపు మాపామన్నారు. 6కోట్ల బోగస్ లబ్ధిదారులను తొలగించి లూటీని ఆపామని ప్రధాని వెల్లడించారు.