కేసు కీలకదశలో ఉన్నందునజగన్‌కు బెయిల్‌ ఇవ్వలేం : హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 4 : జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసుకు కీలకదశకు చేరుకుందున్న సిబిఐ వాదనకు హైకోర్టు ఏకీభవించింది. ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని బుధవారంనాడు స్పష్టం చేసింది. సిబిఐ తరఫున అశోక్‌బాన్‌ వాదించగా.. జగన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలాని తన వాదనలు విన్పించారు. ఇదిలా ఉండగా కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వకూడదని సిబిఐ తరఫున అశోక్‌భాన్‌ వాదించారు. జగన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయగలరని, అయిదు రోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉన్నప్పటికీ ఆయన నోరు విప్పలేదని సిబిఐ తరఫున అశోక్‌బాన్‌ వాదించారు. జగన్‌ తరఫున న్యాయవాది జెఠ్మలాని వాదిస్తూ.. సిబిఐ విచారణ కోసమని పిలిచి జగన్‌ను అరెస్టు చేసిందని, ఆయన అరెస్టు అక్రమమని వాదించారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతోందని, జగన్‌ తన అరెస్టుకు ముందు సాక్ష్యులను ఎవరినీ ప్రభావితం చేసినట్టుగా ఆధారాలు లేవన్నారు. సమగ్ర విచారణ జరపకుండానే అరెస్టు చేశారన్నారు. అరెస్టుకు చూపించిన కారణాలు సరిగా లేవని వాదించారు. మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జగన్‌ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.