కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ..

` డ్రగ్స్‌ గుర్తించిన పోలీసులు
` డిప్యూటీ తహసీల్దార్‌ సహా 8 మంది అరెస్ట్‌
హైదరాబాద్‌,(జనంసాక్షి):డ్రగ్స్‌ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన బర్త్‌డే పార్టీలో యువకులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఈగల్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు.కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టరంట్‌ డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో గచ్చిబౌలి పోలీసులతో పాటు ఈగల్‌ టీమ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. 20 గ్రాముల కొకైన్‌, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్‌ పిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తేజ, విక్రమ్‌, నీలిమ, చందన్‌, పురుషోత్తం రెడ్డి, భార్గవ్‌, రాహుల్‌ ఉన్నారు. వీరిలో తేజ, విక్రమ్‌ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు కాగా..నీలిమ, పురుషోత్తంరెడ్డి, భార్గవ్‌ హైదరాబాద్‌కు చెందినవారు. చందన్‌, రాహుల్‌ బెంగళూరుకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరిద్దరూ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు వెల్లడిరచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.