కొత్తజిల్లాల ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

5

– అభ్యంతరాలు, సూచనలను పరిశీలించండి

– మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఆగస్టు 29(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నాయకత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేశారు. పరిపాలన విభాగాలకు సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలను సీఎస్‌ కు అందించాలని టాస్క్‌ ఫోర్స్‌ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. శాఖలవారీగా అవసరమైన ఉద్యోగులు, సిబ్బందిపై కమిటీ అధ్యయనం చేయనుందని తెలిపారు. జోనల్‌ వ్యవస్థ రద్దు నేపథ్యంలో ఉద్యోగుల పదోన్నతులు, హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. అదనపు సిబ్బంది ఎక్కడ అవసరమో గుర్తించాలని సూచించారు.కొత్త జిల్లాల ఏర్పాటు నిర్మాణాత్మకంగా జరగాలని, ప్రజలకు ఇబ్బంది కలగరాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని చెప్పారు. పరిపాలన విభాగాలకు సంబంధించి రెండు రోజుల్లో ప్రతిపాదనలను సీఎస్‌ కు అందించాలని ఆదేశించారు. అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ కలెక్టర్లతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. పాలనా విభాగాల కూర్పుపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతి శాఖకు ఓ జిల్లా అధికారి ఉండాలని, మండలస్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒకే పనితీరు గల విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒకే అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి తెలిపారు.కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే విషయంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండు రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, కొత్త ఉద్యోగుల నియామకం, పరిపాలనా విభాగాల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నాయకత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు.కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ప్రతిపాదనలపై ఆన్‌ లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి పలు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు కూడా వస్తున్నాయని, వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దసరా నుంచే కొత్త జిల్లాలతో పాటు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి సంబంధించిన పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని ఆదేశించారు.ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది, క్షేత్ర స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. జిల్లా స్థాయిలో ప్రస్తుతమున్న పరిపాలనా విభాగాలను యధావిధిగా కొనసాగించాలా? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా? అనే విషయంపై కూడా అధికారులు సూచనలు చేయాలని చెప్పారు. మంత్రులు, శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశమై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలోని టాస్క్‌ పోర్స్‌ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై పాలనా విభాగాల కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.తెలంగాణలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్యాడర్‌ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున, ప్రస్తుతం జోనల్‌ అధికారులకు అన్యాయం జరగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అధికారులను జిల్లాలకు కేటాయించే క్రమంలో సదరు ఉద్యోగి ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారుల కూర్పులో కూడా కొత్త పద్ధతి అవలంభించాలని చెప్పారు. ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి ¬దా గల అధికారి ఉండాలని చెప్పారు. నీటి పారుదల శాఖకు నీటి పారుదల అభివృద్ధి అధికారి, ఆర్‌ అండ్‌ బీకి రహదారుల అభివృద్ధి అధికారి? ఇలా ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి ఉండాలన్నారు. అధికారులుగా నియమించే వారికి అధికారాల బదలాయింపు జరగాలని చెప్పారు.వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల విషయాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, అవసరాల ప్రాధాన్యతతో ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు సీఎం కేసీఆర్‌. సూపర్‌ వైజరీ పోస్టుల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి, మండల స్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు. ఒకే రకమైన పనితీరు కలిగిన విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే అధికారిని నియమించడం సబబుగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో పరిపాలన విభాగాల కూర్పును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నేతృత్వంలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సి.సి.ఎల్‌.ఎ. రేమండ్‌ పీటర్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, వరంగల్‌, మెదక్‌ కలెక్టర్లు కరుణ, రోనాల్డ్‌ రాస్‌, సిఎంఒ అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్‌ కమిటీ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు ముగ్గురు సీనియర్‌ అధికారులను కూడా కమిటీలో నియమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.