కొత్త చట్టాలు అమల్లోకి వస్తే బాక్సైట్ రద్దయ్యే అవకాశం
శ్రీగిరిజనుల ఎదుగుదలకు సర్కారు సహకారం : ముఖ్యమంత్రి కిరణ్
విశాఖపట్నం,డిసెంబర్ 19 (జనంసాక్షి)
: బాక్సైట్ తవ్వకం అనుమతుల రద్దుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. విశాఖలో ఇందిరమ్మ బాట కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ బయల్దేరి వేళ్లేముందు ఆయన మీడియా తో మాట్లాడారు. బాక్సైట్ అనుమతులపై కేంద్ర ప్రభుత్వం కొత్త పర్యావరణ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత రద్దుపై నిర్ణయం తీసుకుంటా మన్నారు. రాష్ట్రంలో అగ్నిప్రమాద నిర్వాసితులకు వారంలోపే కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విశాఖ రిమ్స్ ఆస్పత్రికి మంజూరి చేసిన రూ.30కోట్లను వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తామని, సింహాచలం భూముల వివాదంపై జనవరి మొదటివారంలో న్యాయనిపుణులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులను కేటాయించే ప్రక్రియ వేగవంతం చేస్తామని సీఎం తెలిపారు. అంతకుముందు విశాఖలో జరిగిన ఇందిరమ్మ బాటలో ఆయన పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.1322 కోట్లు కేటాయించామని తెలిపారు. రోడ్డు మార్గాలు లేకపోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువల్లే నిధులు కేటాయించామని తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం వల్ల గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వచ్చే బడ్జెట్‌లో 4,200 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లోను వెనుకబడి ఉన్నారన్నారు. బాలింతలకు ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు రోజుకు రూ.150 వంతుల ఇవ్వనున్నట్టు తెలిపారు. గిరిజనుల విద్యార్థులను చదువులో ప్రోత్సహిస్తామన్నారు. అలాగే గిరిజన హాస్టళ్లల్లో కూడా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నవజాత శిశువుల రక్షణకు కొత్తగా 800 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిశువుల మరణాలు తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టామన్నారు. గిరిజనుల అభివృద్దికి అనేక పథకాలు చేపట్టామన్నారు. వాటన్నింటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువు ముగిసిన విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రతి ఐటిడిఎ కేంద్రంలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. శిక్షణ తర్వాత రాజీవ్ యువకిరణాలు ద్వారా ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. అంతేగాక స్వయం ఉపాధిపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. తోటల పెంపకంపై అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. దాంతో పెట్టుబడులు మరింత పెరుగుతాయన్నారు. ఆర్థికంగా మేలు చేకూరు తుందని అన్నారు. గిరిజనులు అన్ని రంగాల్లో ముందు ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన ఏర్పర్చుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే నెల మొదటి వారంలో చింతపల్లి వస్తానని తెలిపారు. ఒక కార్యక్రమాన్ని అక్కడి నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు. అర్హులైన వారికి రేషన్ కార్డులను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కాఫీతోటల పెంపకందార్లుతోను, గిరిజన విద్యార్థులతోను ముఖాముఖి నిర్వహించారు. పోలీసులు భారీ భద్రత కల్పించారు.