కొత్త జిల్లాల పటాలు విడుదల

3

హైదరాబాద్‌,ఆగస్టు 26(జనంసాక్షి): రాష్ట్రంలో కొత్తజిల్లాల చిత్రపటాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నకొత్త జిల్లాల మ్యాప్లను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది.పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతిపాదిత జిల్లాల చిత్రపటాలను సిద్ధం చేసింది. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఈఆర్‌ఏసీ సహాయంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ వీటిని రూపొందించారు. వీటిని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. జిల్లా సరిహద్దులు, అందులోని శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, వాటి సరిహద్దులతో పాటు రైల్వే మార్గాలు, జాతీయ, రాష్ట్ర రహదార్లు, నదులు, జల వనరులతో పాటు జలాశయాల వివరాలను పటాల్లో ఉంచారు. ప్రతిపాదిత 27 జిల్లాలతో కూడిన రాష్ట్ర పటంతో పాటు 27 జిల్లాల పటాలను కొత్త జిల్లాల ఏర్పాటుపై అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పొందుపరిచనట్లు తెలిపారు.  మరోవైపు జిల్లాల డ్రాప్ట్పై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 5వేలకు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. కాగా కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్‌ లైన్‌ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్‌ లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది. హైదరాబాద్‌ కు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. కాగా  తొమ్మిది జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్‌ విడుదల అయింది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది.  తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్‌ 11 దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది. దసరా పండుగ రోజున తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావాన్ని చూడవచ్చు.