కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్ర

– శివలింగాన్ని దర్శించుకున్న 73వేల మంది యాత్రికులు
అమర్‌నాథ్‌, జులై7(జ‌నం సాక్షి) : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్‌ నాథ్‌ యాత్ర కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు తరలివెళుతున్నారు. ప్రతికూల వాతావరణంతో బల్టాల్‌ మార్గం నుంచి యాత్రను నిలిపివేసిన అధికారులు, పెహల్గాం నుంచి యథావిధిగా యాత్రను కొనసాగిస్తున్నారు. బల్టాల్‌, పెహల్గాం మార్గాల్లో హెలికాప్టర్‌ సేవలు నిరాటంకంగా సాగుతున్నాయి. గత నెల 28 న అమర్‌ నాథ్‌ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటివరకు 73 వేల మంది యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు. తొమ్మిదో రోజు 4,821 మంది యాత్రికులకు దర్శన భాగ్యం కలిగింది. అమర్‌ నాథ్‌ గుహలో సహజసిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగాన్ని చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దాదాపు 45 నుంచి 60 రోజుల పాటు శివలింగం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్ధానం అవుతుంది. ఈ లోగా దేవదేవుని మంచు రూపాన్ని దర్శించి, తరించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.