కొనసాగుతున్న క్లార్క్‌ పరుగుల వేట

మెల్బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మైఖేల్‌ పరుగుల వేట కొనసాగుతూనే ఉంది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక స్కోర్‌ సాధించిన ఆసీస్‌ క్రికెటర్‌గా అతను రికార్డు సాధించాడు. మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రికార్డును అతను బద్దలు కొట్టాడు. శ్రీలంకపై జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో గురువారం క్లార్క్‌ సెంచరీ సాధించాడు. దీంతో అతను టెస్ట్‌ల్లో 22 సెంచరీలు సాధించాడు. మెల్బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో శ్రీలంకపై జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచులో క్లార్క్‌ 108 పరుగులు చేశాడు. దీంతో అతను ఈ ఏడాదిలో ఆడిన 11 టెస్ట్‌ మ్యాచుల్లో 1595 పరుగులు చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్లో అత్యధిక స్కోరు సాధించిన ఆస్ట్రేలియా క్రీడాకారుడి రికార్డు ఇప్పటి వరకు పాంటింగ్‌ పేరు మీద ఉంది. పాంటింగ్‌ 2005లో 15 టెస్ట్‌లు ఆడి 1544 పరుగులు చేశాడు. ఇది క్లార్క్‌కు ఈ ఏడాది ఐదో టెస్ట్‌ సెంచరీ. ఆసీస్‌ గురువారం ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకపై 284 పరుగుల ఆధిక్యతను సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులు మాత్రమే చేసింది. పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందని క్లార్క్‌ అన్నాడు. ఆసీస్‌కు సంబంధించి రికీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అని, పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టడం ఆనందంగా ఉందన్నాడు.