కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి):
పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి 2.10 గంటల నుంచి 2.30 గంటల మధ్య చోరీ ఘటన చోటు చేసుకుంది. మూడు కిలోల వెండి, 2 తులాల బంగారం, 15వేల రూపాయల నగదు చోరీకి గురైంది. ఆలయం ఎదుట స్థానికులు, భక్తులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి 2.10 గంటల నుంచి 2.30 మధ్య చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు రోజువారీలాగే శనివారం రాత్రి 2.10 గంటలకు ఆలయం వద్దకు వచ్చి అంతా సవ్యంగా ఉండడంతో రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లారు. తిరిగి 2.30గంటలకు ఆలయం వద్దకు వచ్చేసరికి తలుపు విరగ్గొట్టి ఉండడం చూసి సమాచారాన్ని పోలీసుల ఉన్నతాధికా రులకు అందజేశారన్నారు. తాము ఆలయం వద్దకు వచ్చి చోరీ సమాచారాన్ని ఆలయ కమిటీ చైర్మన్‌కు అందించగా ఆయన కూడా వచ్చారన్నారు. ఆ తర్వాత పరిశీలించగా మూడు కిలోల వెండి కిరీటం, రెండు తులాల అమ్మవారి మెడలోని గొలుసు, 15వేల రూపాయల నగదు చోరీ అయినట్టు చైర్మన్‌ చెప్పారన్నారు. గుర్తు తెలీని వ్యక్తులు గోడ దూకి లోపలికి ప్రవేశించి తలుపు బద్దలు కొట్టి చోరీకి పాల్పడినట్టుగా గుర్తించామన్నారు. క్లూస్‌ కోసం యత్నిస్తున్నామన్నారు. ప్రత్యేక బృందాలను నియమిస్తు న్నామని, నిందితుల కోసం గాలింపు చేపడతామని చెప్పారు.
చోరీకి పాల్పడ్డవారిని పట్టుకోండి…
చోరీలకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని మహంకాళి ఆలయ చైర్మనశంకర్‌గౌడ్‌ అన్నారు. తనకు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3.35 గంటలకు సమాచారం ఇవ్వడంతో ఆలయానికి చేరుకున్నా నన్నారు. అంతా పరిశీలించానన్నారు. గోడ దూకి దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించామన్నారు. అమ్మవారి మెడలోని గొలుసు, కిరీటం, ముక్కెర అపహరణకు గురయ్యాయన్నారు. అంతేగాక దొంగలు స్టోర్‌ రూము తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి 15వేల రూపాయల నగదును కూడా దోచుకువెళ్లారన్నారు. పోలీసుల గస్తీ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. అంతేగాక తమ మనిషి కూడా కాపలా ఉంటారన్నారు. జరిగిన దొంగతనం మిస్టరీని పోలీసులు చేధించాల్సిందేనన్నారు.
శాంతిభద్రతలపై మంత్రులు బదులివ్వాలి..
చోరీలు జరిగినప్పుడల్లా మంత్రులు, అధికారులు వచ్చి గస్తీ విషయంపై హామీలు ఇచ్చి వెళుతున్నారని, తాజాగా శనివారం అర్ధరాత్రి జరిగిన దొంగతనానికి బదులేమి ఇస్తారని స్థానికులు అంటున్నారు. మంత్రులు వచ్చేంతవరకు, గస్తీపై తీసుకుంటున్న చర్యలను వెల్లడించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు ఆలయం ఎదుట బైఠాయించారు. ఈ ఏడాదిలో జంట నగరాల్లో ఇప్పటివరకు 14 ఆలయాల్లో దొంగతనాలు జరిగాయని, ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకున్న దాఖలాలు లేవన్నారు. 15 రోజుల క్రితమే లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో చోరీ జరిగిందని, దాన్ని మరిచిపోకముందే రెండు రోజుల క్రితం ఒక ఆలయంలో చోరీ జరిగిందని, తాజాగా ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో జరిగిందని, ఆలయాల దొంగతనాలనివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని డిమాండు చేశారు. అమ్మవారి నగలు అపహరించుకోవడం పట్ల సమాజానికి చేటు వాటిల్లుతుందని, దొంగతనాలకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిందేనని స్థానికులు కోరుతున్నారు.