కొనసాగుతున్న రాజీనామాల పరంపర

ముంబై : సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ సినిమా సర్టిఫికేషన్ క్లియరెన్స్ నేపథ్యంలో సెన్సార్ బోర్డులో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలతో బోర్డు సభ్యులు 9 మంది శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.  తమ రాజీనామా లేఖలను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకి సమర్పించారు.  భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ,  టీజీ త్యాగరాజన్, మమంగ్ దాయ్, సుబ్రాగుప్త, రాజీవ్ మసంద్లతో పాటు మరో ఇద్దరు సభ్యులు రాజీనామా లేఖలు పంపారు.

బోర్డు చైర్మన్ లీలా శాంసన్ శుక్రవారం తన రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’పై ఎటువంటి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, అధికారం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తన లేఖలో వివరించారు. మంత్రిత్వ శాఖ చోక్యం, అవినీతి మూలంగానే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని చైర్మన్, సభ్యుల వాదన. సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి నిధులు కానీ, మద్ధతు ఉండేది కాదని లేఖలలో పేర్కొన్నారు. ఏ ఒక్క నిర్ణయం తమకు అనుకూలంగా తీసుకోలేదని ఆ శాఖ తీరుని వెల్లడించారు.

కాగా ఈ పరిణామాలపై రాజవర్థన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ సినిమాల సర్టిఫికేషన్ విషయంలో ప్రభుత్వం జోక్యం ఉండదని, ఆవిషయాలకు తాము ఎప్పుడూ దూరంగా ఉంటామని అన్నారు.