కొన్నిసార్లు చిరునవ్వు, మరికొన్నిసార్లు మౌనం

కొన్నిసార్లు చిరునవ్వు, మరికొన్నిసార్లు మౌనం

న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ తమ విచారణకు సహకరించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త శశి థరూర్ను ఢిల్లీ పోలీసులు సోమవారం రాత్రి ప్రశ్నించిన విషయం తెలిసిందే. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.  సునంద మృతి చెందిన రోజు ఏం జరిగింది, ఐపీఎల్  వ్యాపార లావాదేవీల ఆరా తీసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే  ఈ కేసు విచారణలో మరికొంతమందిని ప్రశ్నించాల్సి ఉందన్నారు.  కాగా ఈ సందర్భంగా శశిథరూర్ పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు కొన్నిసార్లు చిరునవ్వుతో సమాధానం ఇవ్వగా, మరికొన్ని మౌనాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.

అదనపు డీసీపీ పీఎస్ కుష్వా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం థరూర్‌ను ప్రశ్నించింది. పోలీసులు ప్రశ్నించడం ఆయన్ని ప్రశ్నించటం ఇదే తొలిసారి. కాగా సునంద మరణించిన జనవరి 17న ఏం జరిగింది? అంతకు ముందు జనవరి 15న తిరువనంతపురం నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత థరూర్‌ను వదిలేసి సునంద ఒంటరిగా హోటల్ గది ఎందుకు తీసుకున్నారు?  సునంద ఆరోగ్య పరిస్థితి ఏంటి? పాకిస్తానీ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో థరూర్ సంబంధాలేంటి?’ తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.