కొప్పులకు కుల సంఘాల అండ

జగిత్యాల,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న  మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కే తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ  పలు గ్రామాల్లోని కుల సంఘాలు ఏక గ్రీవ నిర్ణయం తీసుకు న్నాయి.మున్నూరు కాపులు, రజకులు, గీతా కార్మికులు, ముదిరాజ్‌లు, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, హరిజనులు, మైనార్టీ కులాల సంఘం నాయకులు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు.  నియోజకవర్గ అభివృద్ధితో పాటు, తమ గ్రామాభివృద్ధికి కొప్పుల అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సీఎం కేసీఆర్‌ ప్రగతిపథంలో నడిపించారని అన్నారు. తెలంగాణ బిడ్డలకు ఏం చేస్తే బాగుంటుంది వారికి ఏం చేయాలి, గౌరవంగా ఎలా బతుకుతారో అని తెలుసుకొని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతు పక్షపాతిగా మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా 46 వేల చెరువులను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేజీ టూ పీజీ విద్యను అందజేస్తూ గిరిజన, దళిత, మైనార్టీ హాస్టల్‌లలో విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్నారన్నారని వారు అన్నారు.