కొలువుల జాతర
– గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల
– 1032 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
హైదరాబాద్,సెప్టెంబర్ 1(జనంసాక్షి): నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2వతేదీ నుంచి ఈ నెల 23వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రూప్-2 పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్-259, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్-156, ఎక్సైజ్ ఎస్‌ఐ-284, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్-90 పోస్టులున్నాయి. గతంలో ఇచ్చిన 439పోస్టులు, ఇటీవల అనుమతించిన 593 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా 1,036 కొలువుల భర్తీకి సత్వర చర్యలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం క్యాంపు కార్యాలయంలో కలుసుకొని భర్తీ పక్రియ గురించి వివరించారు. గురుకుల విద్యాసంస్థల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చక్రపాణి సీఎంకు తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీపై సంబంధిత వివరాలు అందాక ప్రకటన చేస్తామని చెప్పారు. నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సీఎం ఈ సందర్భంగా సూచించినట్టు సమాచారం. ఇదిలాఉండగా ఎంపిక పక్రియను వేగంగా పూర్తిచేసేందుకు కమిషన్ వర్గాలు జిల్లాస్థాయి అధికారులతో ఉత్తరప్రత్యుత్తరాలు మొదలుపెట్టాయి. గత ఏడాది 439 ఖాళీలతో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు 5,64,431 దరఖాస్తులు రాగా పలు కారణాల వల్ల ఆ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను మదింపు చేసి కొత్త పోస్టులు జతచేస్తూ అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 597 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టీఎస్‌పీఎస్సీ దీనిపై అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతునున్నది. మరో రెండు లక్షల ముప్పై వేల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తంవిూద అభ్యర్థుల సంఖ్య ఏడున్నర లక్షలకు పైగా ఉంటుందని బావిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రాథమికంగా సిద్ధమైందని తెలుస్తున్నది. పాత, కొత్త అభ్యర్థులకు కలిపి పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ వర్గాలు జిల్లా కలెక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నాయి.