కొల్లాపూర్ మీదుగా రెండవ జాతీయ రహదారి..

గ్రామాల్లో భూములకు పెరగనున్న ధరలు..

రహదారితో కొల్లాపూర్ లో జంక్షన్ ఏర్పడే అవకాశం. .
కొల్లాపూర్ పర్యాటకం అభివృద్ధి..

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై31(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్రానికి మరో నూతన జాతీయ రహదారికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.అల్లంపూర్ చౌరస్తా నేషనల్ హైవే 44 నుండి వయా అలంపూర్, కృష్ణానది మీదుగా చిన్నంబావి, కొల్లాపూర్, నార్లాపూర్,మారెడుమాన్ దిన్నె,రాష్ట్ర, అంబటిపల్లి, లింగాల, బల్మూర్, అచ్చంపేట, హాజీపూర్, డిండి , మల్లెపల్లి మీదుగా నల్లగొండ నేషనల్ హైవే 565 కి కనెక్టివిటీ సంబంధించి నూతన జాతీయ రహదారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని వినికిడి.ఈ జాతీయ రహదారి నంద్యాల, కల్వకుర్తి ఎన్ హెచ్167కె రహదారికి కొల్లాపూర్ దగ్గర జంక్షన్ ఏర్పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంజూరైన ఎన్ హెచ్ 167కె తో పాటు కొల్లాపూర్ మీదుగా రెండవ జాతీయ రహదారిగా కొత్తగా నెంబర్ వచ్చే అవకాశం ఉంది.దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కొనసాగు తున్నాయని ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు అంటున్నారు.ఇప్పటికే ఈ అంశంపై కొల్లాపూర్, అలంపూర్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి,డాక్టర్ అబ్రహం ఇరువురితో పాటు రాష్ట్ర మంత్రులు సైతం ఈ జాతీయ రహదారికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నూతన జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం  మంజూరు చేస్తే పర్యాటక అభివృద్ధితో పాటు పలు నగరాలకు దూరం, వ్యయబారం తగ్గుతుందని,దీనితో కొల్లాపూర్ ప్రాంతం సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతం పర్యాటక అభివృద్ధిలో సైతం వేగం పుంజుకుంటుందని త్వరలోనే ఈ జాతీయ రహదారి సంబంధించిన అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేసే అవకాశం ఉందని పలువురు సీనియర్ ఇంజనీర్లు మరియు మేధావులు ,ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.కొన్ని సంవత్సరాలు గా వెల్టూరు- గుందిమల్ల రోడ్డు కం బ్యారేజ్ గా ప్రధాన డిమాండ్ గా ఉన్న ఈ అంశం నెరవేరబోతుందని ఈ ప్రాంత ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.దీనితో కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు నుండి నల్గొండ వరకు సుమారు 225 కిలోమీటర్లు రహదా జాతీయ రహదారిగా రూపు దిద్దు కోనుంది.అన్ని సవ్యంగా జరిగితే, వచ్చే వేసవిలో రహదారి నిర్మాణం కోసం పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని,కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు జాతీయ రహదారితో అభివృద్ధి జరిగే అవకాశం ఉందని పలువురు ప్రముఖులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.ఈ జాతీయ రహదారి మంజూరు అయితే రహదారి పొడవునా ఉన్న గ్రామాల్లో భూములకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

వేసవిలో రహదారి నిర్మాణ పనులు.