కోటకట్ట చెరువు నిర్మాణంలో అధికారుల వైఫల్యం

యర్రగొండపాలెం ,జూలై 24,: నల్లమల అటవీప్రాంతంలోని కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌ విమర్శించారు. సిపిఐ కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా నాయకులు టిసిహెచ్‌ చెన్నయ్య, కెవి కృష్ణగౌడ్‌లు నాయకత్వం వహించారు. ఈ ధర్నాలో ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ చెరువు నిర్మాణం చేపట్టాలని 1969లోనే అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారని ఆ నాటి నాయకుల స్వార్ధం వలన ఈ చెరువు నిర్మాణానికి నోచుకోలేదని తిరిగి 1982లో 80 వేల రూపాయలతో అధికారులు అంచనాలు తయారు చేశారని నాటి నుంచి నేటి వరకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడమే తప్ప నిర్మాణ పనుల్లో పురోగతి సాధించలేదు. ఈ చెరువు నిర్మాణం వలన 2 వేల ఎకరాలకు సాగునీరు, 10 గ్రామాలకు తాగునీరు లభిస్తుందని, అడవిలో నివసించే గిరిజన గూడాలు, వన్యప్రాణులకు నీటి సంరక్షణ లభిస్తుందని ఈ చెరువు నిర్మాణం వలన బహుళప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ చెరువు నిర్మాణంలో అటవీశాఖ, ఇరిగేషన్‌శాఖ అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఈ చెరువు నిర్మాణానికి సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంజివారిపల్లి మాజీ సర్పంచి శ్రీనివాసరెడ్డి, మూలా వెంకటేశ్వరరెడ్డి, జి రమణారెడ్డి, సిపిఐ నాయకులు కె గురవయ్య, వెంకటేశ్వర్లు, గురునాధం, శ్రీనివాసరావు, యోగయ్య, వెంకట శివయ్యలతో పాటు భారీ సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు, గంజివారిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం తహసీల్దారు చంద్రలీల, ఇరిగేషన్‌ ఎఇ వెంకటేశ్వరరెడ్డిలతో నిర్మాణ పనుల గురించి చర్చలు కొనసాగించారు. అనంతరం మార్కాపురం అటవీశాఖ అధికారితో ఫోన్‌లో తహసీల్దారు, సిపిఐ నాయకులు కెవివి ప్రసాద్‌లు చర్చలు జరిపారు. డిఎఫ్‌ఓ వారం రోజుల్లో తమశాఖ ఇరిగేషన్‌ అధికారులతో సంబంధించిన సర్వేలను ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తాజావార్తలు