కోటకట్ల చెరువును పరిశీలించిన సిపిఐ బృందం
యర్రగొండపాలెం , జూలై 11 : మండలంలోని నల్లమల అటవీప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన కోటకట్ల చెరువును సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కెవివి ప్రసాద్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో ఈ చెరువు నిర్మించడం ద్వారా సుమారు 20 గ్రామాలకు సాగునీరు లభిస్తుందని, 2 వేల ఎకరాల భూములకు సాగునీరు ఉంటుందని ఆయన వివరించారు. ఈ చెరువు నిర్మాణానికి ప్రభుత్వం 1969లో ప్రతిపాదనలు పంపిందని, 1987లో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి గంజివారిపల్లి, జంగంవారిపల్లి, వెంకటాద్రిపాలెం గ్రామాలకు చెందిన రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉంటుందని తేల్చారు. అంతేకాకుండా చెరువు నిర్మాణం వలన పరిసర గ్రామాలైన అల్లిపాలెం, దద్దనాల, చెంచుపల్లి, తెలుగురాయునిచెరువు, శుద్ధకుంట, గాంధీనగర్, అంకమ్మగూడెం, ప్రకాశ్‌నగర్, జంగం తాండా, పునరావాసకాలనీ, వీరభద్రాపురం, గడ్డమీదిపల్లి, సాయిబాబానగర్, యర్రగొండపాలెం గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య తీరుతుందని అంతేకాకుండా అటవీప్రాంతంలో నివసించే వన్య ప్రాణులకు నీటి రక్షణ కలుగుతుందని, ఈ ప్రాజెక్టు వలన పరిసర ప్రాంతాల్లో బహుళప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం 2008-09 సంవత్సరానికి సుమారు 14 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ చెరువు నిర్మాణానికి సుమారు 300 ఎకరాల అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందని, రెవెన్యూ, అటవీశాఖ నిర్లక్ష్యం వలనే జాప్యం జరుగుతుందని ఇప్పటికైనా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల కరువును దృష్టిలో ఉంచుకొని చెరువు నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతినిథులు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువు నిర్మాణాన్ని చేపట్టాలని ఈ నెల 22వ తేదీ నుండి 23వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమారెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు టిసిహెచ్ చెన్నయ్య, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండల కార్యదర్శులు కెవి కృష్ణగౌడ్, గురునాధం, గాలి సుబ్బరాయుడులతో పాటు సిపిఐ నాయకులు, గంజివారిపల్లి గ్రామస్తులు ఉన్నారు.