కోనాయపల్లి…కరీంనగర్‌ సెంటిమెంట్‌ 

తెలంగాణ ఉద్యమ కోసం ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కెసిఆర్‌ వేయని ఎత్తు లేదు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఆయన చేసిన అనేక సాహసాలకు ప్రజలు జేజేలు కొట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా అదే ఎత్తులతో అనేక పథకాలతో ఆయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. తరవాత 2018లో కూడా అధికారం సాధించారు. అనేక పథకాలను అమలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే ధీమాతో వందసీట్లకు పైగానే గెల్చుకుని మల్లీ అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించి ఏకంగా 88సీట్లు సాధించారు. తాజాగా ఇప్పుడు లోక్‌సభలో 16 సీట్లు లక్ష్యంగా మళ్లీ ప్రచారం రంగంలోకి దిగబోతున్నారు.  ఏ కార్యక్రమం చేపట్టినా కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. అలాగే కరీంనగర్‌ సెంటిమెంట్‌ కూడా కలసివచ్చే అంశం. దీంతో మారోమారు కెసిఆర్‌ కోనాయిపల్లికి రానున్నారు. తరవాత కరీంనగర్‌ సభకు బయలుదేరుతారు. ఇదే నమ్మకం ఆయనను విజయతీరాలకు తీసుకుని  వెళుతోంది. అందుకే 17న కరీంనగర్‌ నుంచి లోక్‌భ ఎన్నికల ప్రచారానికి కెసిఆర్‌ సమరశంఖం ఊదబోతున్నారు. కేసీఆర్‌కు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఆది నుంచీ సెంటిమెంట్‌గా కలిసివస్తున్నది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయతీరాలను తాకి తీరుతుందన్న నమ్మకం ఆయనలో ఉన్నది. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. పలు చారిత్రక కార్యక్రమాలకు ఇక్కడే అంకురార్పణ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్‌, 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జరిగిన పలు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సీఎం కేసీఆర్‌ ఇక్కడి నుంచే ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా తనకు అత్యంత గుర్తింపు తెచ్చిన రైతుబంధు పథకానికి జిల్లాలోని హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌- శాలపల్లి నుంచే శ్రీకారం చుట్టారు. అంతకు ముందు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన సందర్భంగా, 17 జిల్లాల పరిధిలో ప్రాంతీయ సదస్సును కూడా కరీంనగర్‌లోనే నిర్వహించారు. రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్న రైతుబీమా పథకాన్ని ఇక్కడే ప్రకటించారు. ఈ పథకం కూడా సీఎం కేసీఆర్‌కు మంచి తెచ్చిపెట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడి నుంచే సమరశంఖం పూరించారు. అసెంబ్లీ రద్దు తర్వాత సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌లో మొదటి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా 88 ఎమ్మెల్యే సీట్లతో తిరిగి అధికారంలోకి వచ్చారు. ముందు నుంచీ కరీంనగర్‌ అంటే ప్రత్యేక సెంటిమెంట్‌గా భావిస్తున్న అధినేత, పార్లమెంట్‌ ఎన్నికలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.  నెల 17న కరీంనగర్‌ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ పార్లమెంట్‌ ఎన్నికలకు ఇక్కడి నుంచే సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి రెండు లక్షలకుపైగా జనాన్ని సవిూకరించాలని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్ణయించారు. భారీ బహిరంగ సభకు తక్కువ వ్యవధి ఉన్నందున శరవేగంగా ఏర్పాట్లు చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు సమాయత్తమవుతున్నారు. మొత్తానికి కేసీఆర్‌ తన సెంటిమెంట్‌ జిల్లా నుంచే మరో సభకు శ్రీకారం చుడుతున్న వేళ కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. పట్టుదలతో జన సవిూకరణ చేపట్టి సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు.  ఇదే స్ఫూర్తితో పార్లమెంట్‌ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. తెలంగాణ ప్రజలు నిర్ణయించిన వారే ఢిల్లీ పీఠం ఎక్కాలని
స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఒకటి మిత్రపక్షమైన ఎంఐఎం గెలుచుకుంటుందనీ, మిగతా 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలనీ, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సరిగ్గా నెల రోజుల్లో అంటే వచ్చే నెల 11న పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి.  కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు మించి సమయం లేదు. ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు ఉన్న గడువు చాలా తక్కువ. అయినప్పటికీ, కాంగ్రెస్‌, బీజేపీల్లో ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అన్నది నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ప్రభావంతో జాతీయ పార్టీల్లో కలవరం రెట్టింపయ్యింది.  ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలూ పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇదే విషయాన్ని వారు తమ అంతర్గత సమావేశాల్లో చెప్పడంతోపాటు బాహాటంగా కూడా ప్రకటించారు. లోక్‌సభ స్థానాలకు పోటీచేయడానికి పార్టీ అగ్రనేతలే ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్‌లోని ద్వితీయశ్రేణి నేతలు.. టీఆర్‌ఎస్‌ వైపు చూడడం మొదలుపెట్టారు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణలో గులాబీదే పైచేయిగా ఉంది. ఎన్నికల్లో దూసుకుని పోతున్న పార్టీగా ప్రజల్లో విశ్వాసం కలిగించింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు ధీమాతో కెసిఆర్‌ ఉన్నారు.
———————–