కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

టేకులపల్లి,అక్టోబర్ 22( జనం సాక్షి): కొమరం భీమ్ జయంతి వేడుకలను టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమం ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎస్ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మోకాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కొమరం భీమ్ జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆదివాసి హక్కుల కోసం హైదరాబాదు నిజం నవాబుల మీద పోరాడిన యోధుడు కొమరం భీం ఆశయ సాధనకు ఆదివాసి సమాజం ఐక్యంగా ఆదివాసి హక్కులకై పోరాడాలనిపిలుపునిచ్చారు. ఆదివాసి పోడు రైతులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు రైతుల పైన ఫారెస్ట్ పోలీస్ అధికారులు దాడులు నిలిపివేసి పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 తో పాటుగా ఏజెన్సీ ప్రాంతంలోని 29 శాఖలలోని ఉద్యోగ అవకాశాలు ఆదివాసీలకు చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం రూపొందించాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టబోయే ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలు పదోన్నతులు బదిలీలు జీవో నెంబర్ 3 ప్రకారమే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసి ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరుద్యోగులు సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరం లాలయ్య, పి పాపారావు, నాగేశ్వరరావు,శారద, బాలరాజు, వీరన్న, శ్రీనివాస్, బాలాజీ,బిచ్చ తదితరులు పాల్గొన్నారు.