కౌలు రైతులకు సాగు కష్టమే
తమకూ పెట్టుబడి సాయం ఇవ్వాలని వినతి
సిద్దిపేట,నవంబర్23(జనంసాక్షి): వ్యవసాయాధికారులు పంటల సాగుపై ,సస్యరక్షణ చర్యలపై రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించి పంటల దిగుబడులు పెరిగేలా పాటుపడాలని రైతులు కోరుతున్నారు. ఇదిలావుంటే ఆర్థిక ఇబ్బందులతో సతమయ్యే అన్నదాతలకు ప్రభుత్వం ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడికి సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వానకాలం రూ.4వేలు, యాసంగికి ఎకరాలకు రూ.4వేలు అందించినట్లయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, భూమిని
కౌలుకు తీసుకొని సేద్యం చేసే కౌలు రైతులకు ఇందులో అవకాశం లేకుండా పోయింది. కౌలురైతులకు కాకుండా పట్టా బూమి ఉన్న వారికే ఇస్తామని సిఎం కెసిఆర్ ఇటీవలే ప్రకటించారు. దీంతో తమకు అవకాశం రాదని గ్రామాల్లో చర్చ జరుగుతున్నది. కంది పంటలకు గత యేడాది ధరలు లేనందున ఆయా పంటలు సాగు చేసే ఆలోచనలో రైతులు లేరని, పత్తి పంటల వైపే రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని
పలువురు అభిప్రాయ పడుతున్నారు. గతంలో కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసినప్పటికీ అవి పూర్తిస్థాయిలో పంపిణీ జరగకపోగా అనుకున్న ప్రయోజనాలు దక్కలేదు. ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రూ.4వేల పథకంలో అవకాశం ఇవ్వాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.




