క్యాన్సర్‌కు మనోధైర్యమే పెద్ద చికిత్స: పారికర్‌

పనాజి,జూలై6(జ‌నం సాక్షి): క్యాన్సర్‌ తో బాధపడుతున్న వారు మనోబలం, ఆత్మస్థయిర్యంతో ఉండాలని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కొద్దిరోజుల పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు. దీని నుంచి కోలుకుని ఇటీవలే ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ కథానాయిక సోనాలీ బింద్రే కూడా మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బుధవారం ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా పారికర్‌ మాట్లాడుతూ…’నాకు పాంక్రియాటిక్‌ కాన్సర్‌ అని వైద్యులు చెప్పగానే నాలో ఒక రకమైన అలజడి రేగింది. విషయం తెలియగానే నా కుటుంబసభ్యులు ఎంతగానే భయపడ్డారు. కానీ నేను మాత్రం భయపడలేదు. నా మనోబలం, ఆత్మస్థైర్యం నాకు తోడుగా ఉంది. అదే నన్ను ఈ వ్యాధి నుంచి బయట పడేలా చేసింది అన్నారు. సోనాలీ బింద్రే గురించి మాట్లాడుతూ..’ కాన్సర్‌ అని చెప్పగానే సాధారణంగా ఎవరైనా కుంగుబాటుకు గురవుతారు. ఆమె గొప్ప ధైర్యవంతురాలు కాబట్టే తన వ్యాధి గురించి బహిర్గతంగా చెప్పారు. ధైర్యంగా పోరాడతానని కూడా చెప్పడం అభినందనీయం అని అన్నారు. ఇలా ఎవరైనా వ్యాధి సోకగానే కుంగుబాటుకు గురికావద్దన్నారు. దీనికి మనోధైర్యమే పెద్ద చికిత్స అని పారికటర్‌ పేర్కొన్నారు.