క్రీడలు ఆరోగ్యానికి దోహదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8   క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమని జిల్లా యువజన సంక్షేమాధికారి డి.సాయిలు అన్నారు. క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామ మాజీ సర్పంచ్‌ దివంగత కోల ప్రభుదాస్‌ స్మారక జిల్లా స్థాయి క్రీడల పోటీలను జాన్కంపేట సమీపంలో గల అలీసాగర్‌ ఎత్తిపోతల పంప్‌ సమీపంలో అధికారి సాయిలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్యం గల క్రీడాకారులకు యువజన సంక్షేమ శాఖ తరపున తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ప్రభుదాస్‌ ఆశయాలు నెరవేర్చడంలో భాగంగా ఆయన తనయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని 40 జట్లు పాల్గొంటున్నాయి. ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, రెంజల్‌, నందిపేట తదితర మండలాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వేణుగోపాల్‌, ప్రభుదాస్‌ తనయులు ఇంద్రకరణ్‌, పవన్‌కుమార్‌, మహేష్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.