క్రీడారత్న నేషనల్ అవార్డుకు ఎంపికైన గురుకుల ఫిజికల్ డైరెక్టర్
తిమ్మాపూర్, అక్టోబర్ 15 (జనం సాక్షి): క్రీడారత్న నేషనల్ అవార్డు – 2022 సంవత్సరానికిగాను ఫిజికల్ డైరెక్టర్ బైరం సుషమ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటి వారు ప్రకటించారు.
బి. సుషమ 1993 నుండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల, మల్లాపూర్, సుభాష్ నగర్, చింతకుంట, గర్రెపల్లి, అదిలాబాద్, బోన్ లలో గత 29 సంవత్సరాలుగా వారి సేవలను అందిస్తూ విద్యార్థులను వివిధ క్రీడలలో తీర్చిదిద్దారు. అందులో కొంత మంది విద్యార్థులు ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులుగా, మరి కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పోలీసు శాఖలలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో సేవలు అందిస్తూ స్వయంగా యోగా మరియు మాస్టర్ అథ్లెటిక్స్ లో ఇప్పటికీ పాల్గొంటూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు, వెండి పతకాలను సాధించారు. అంతేగాక సాంఘీక సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి నుండి అనేక సార్లు ప్రశంసా
పత్రాలు పొందారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ నుండి ఉత్తమ పి.డి.గా ప్రశంసా పత్రాన్ని కూడా పొందారు.
ప్రస్తుతము తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా కేంద్రం (సి.ఓ. ఇ.) లో ఫిజికల్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు.
అవార్డు సెలెక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బి.యస్.ఎ. జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైద్రాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమి జాతీయ కార్యాలయములో అందజేశారు. ఈ సంవత్సరం నవంబర్ 13వ తేదిన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ 3వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా క్రీడారత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో బి.యస్.ఎ. జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యం.యం. గౌతమ్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్స్ బాదె వెంకటేశం మరియు పానుగంటి రాజలింగం లు పాల్గొన్నారు.