‘క్లీన్లీనెస్ డ్రైవ్‌’ కార్యక్రమంలో సిఎం యోగి

లక్నో(జ‌నం సాక్షి ): గోమతి నది పరిసరాలను శుభ్రపరచే కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు పాల్గొన్నారు. ఆయన స్వయంగా చీపురుపట్టి చెత్తాచెదారం ఏరివేసే ‘క్లీన్లీనెస్ డ్రైవ్‌’ను చేపట్టారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, మేయర్, పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని ఈ సందర్భంగా యోగి అన్నారు.’మహాత్మా గాంధీ కేవలం దేశ స్వతంత్ర్యం కోసమే కలగన లేదు. క్లీన్ ఇండియా కోసం తపించారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భరతమాతకు సేవచేయాలని మనమంతా ప్రతినబూనాలి. పరిశుభ్రతకు మారుపేరుగా ప్రపంచంలో అనేక దేశాలు నిలిచాయి. ఇందుకు అక్కడి ప్రజల కృషి, పట్టుదలే కారణం’ అని యోగి ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు సమయం కేటాయించాలని ఆయన కోరారు. గోమతి నది పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో 7000 మంది వలంటీర్లు కూడా పాల్గొన్నారు.