క్షణం.. క్షణం.. ఉత్కంఠ

– పార్టీలకు చెమటలు పట్టించిన కన్నడ ఓటర్లు
– ఫలితాలు తారుమారుతో పార్టీలో తీవ్ర ఉత్కంఠ
– కొద్దిసేపు సంబరాలు.. మరికొద్దిసేపు ఆందోళన
– పూర్తి మెజార్టీ దిశగా సాగిన బీజేపీ
– అంతలోనే హంగ్‌వైపు ఫలితాలు
– హంగ్‌తో కింగ్‌మేకర్‌గా నిలిచిన జేడీఎస్‌
బెంగళూరు, మే15(జ‌నం సాక్షి ) : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠతను రేపాయి. క్షణం.. క్షణం మారిన ఫలితాలో పార్టీల నేతలు తలలు పట్టుకున్నారు. ఎప్పడు ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో అంటూ చూస్తుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఉదయం 8గంటలకు మొత్తం 40 కేంద్రాల్లో ఓట్ల
లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.. దీంతో తొలి అర్థగంటపాటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో మెజార్టీలోకి వచ్చారు. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్క ప్రకారం కాంగ్రెస్‌ పార్టీనే గెలుస్తుందని అందరూ భావించారు.. గంటపాటు అలాగే సాగిన ఫలితాలు ఒక్కసారిగా బీజేపీవైపు దూసుకెళ్లాయి.. ఉదయం 9గంటలకు బీజేపీ మెజార్టీలోకి వచ్చింది.. మళ్లీ 11 గంటలవరకు వెలువడిన ట్రెండ్స్‌బట్టి బీజేపీ సులభంగా 115 స్థానాలకు పైగా మెజార్టీలోకి వచ్చింది.. దీంతో ఇక మాదే విజయం అని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. యడ్యూరప్ప నివాసం వద్ద సందడి నెలకొంది. దీంతో బీజేపీ పార్టీ నేతలు స్వీట్లు పంచుతూ సందడి చేశారు. ఢిల్లీ బీజేపీ కేంద్రంలోనూ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈలోపే ముఖ్యనేతలు, ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రెస్‌విూట్‌లు పెట్టిమరీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల పై విరుచుకు పడ్డారు. ఈలోపే 12.30 గంటల సమయంలో ఫలితాలు తారమారవుతూ వచ్చాయి. అప్పటి వరకు బీజేపీకి తిరుగు లేదనుకున్న ప్రజలు.. మరోసారి ఉత్కంఠతకు తెరతీస్తూ బీజేపీ మెజార్టీ తగ్గుకుంటూ వచ్చింది.. మళ్లీ కాంగ్రెస్‌ ఒక్కసారిగా ఊపందుకోవటంతో మెజార్టీ తారుమారయ్యే పరిస్థితి ఏర్పండింది. దీంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం కాగా కాంగ్రెస్‌ నేతల్లో ఆశలు చిగురించాయి.. 115 స్థానాల్లో మెజార్టీతో కొనసాగిన బీజేపీ తగ్గుకుంటూ వస్తూ మ్యాజిక్‌ పింగర్‌ కంటే తక్కువ స్థానాలకు పడిపోయింది.. రెండుమూడు స్థానాలు తగ్గుతాయని అందరూ భావించగా.. ఈలోపే బీజేపీ 104 స్థానాలకే పడిపోయింది.. దీంతో హంగ్‌ అనివార్యమైంది.. మరోవైపు కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, ఇతరులు మూడు స్థానాలతో నిలిచారు. హంగ్‌ ఏర్పడటంతో మూడవ స్థానంలో ఉన్న జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా మారింది.
——————————–