ఖమ్మంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ప్లీనరీని సీఎం కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేసి KCR-KMM1ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు… అమరవీరుల స్తూపానికి నివాళలు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు… నాలుగువేల మంది పార్టీ ప్రతినిధులు ప్లీనరీకి హాజరయ్యారు. తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుంటూ ప్లీనరీ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

టీఆర్ఎస్ కు ప్రజలే బాసులని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను తట్టుకొని హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ తోనే ఉంటామని చాటిచెప్పారన్నారు. టీఆర్ఎస్ శ్రేణులకు గర్వం పనికి రాదన్న ముఖ్యమంత్రి… జయానికి పొంగిపోవద్దని హితవు పలికారు.

అటు పార్టీ, ఇటు ప్రభుత్వం జోడు గుర్రాల్లాగా పరుగెత్తాల్సిన అవసరముందన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ యంత్రాంగమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మేనిఫెస్టోను వందశాతం అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి నిధులు, నియామకాల సమస్య తీరిపోయిందన్నారు సీఎం కేసీఆర్. ఇక మిగిలింది నీళ్ల సమస్యేనని చెప్పారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.

తెలంగాణలో పేదరికాన్ని తరిమికొట్టేందుకు కృషి చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. మిషన్ కాకతీయను యావత్ ప్రపంచం ప్రశంసిస్తోందని గుర్తు చేశారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్ల అడగబోమని చెప్పిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.

ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరగకుండా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టేందుకు కలసికట్టుగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో ఇక చీకటి రోజులుండవన్న ముఖ్యమంత్రి… కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. టీఆరెస్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఈటెల వివరించారు. టీఆర్ఎస్ం ప్లీనరీలో మొదటి తీర్మానాన్ని ఈటెల ప్రవేశపెట్టారు. తెలంగాణ సంక్షేమం-దేశానికే తలమానికం అనే తీర్మానాన్ని…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బలపరిచారు.

కంటతడిపెట్టిన తెలంగాణ అంతటికి కేసీఆర్ నమ్మకమై నిలిచాడన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరెడ్డి. సుదీర్ఘకాలం వెన్నుచూపకుండా.. అద్భుత పోరాటంతో అజేయమైన చరిత్రను తెలంగాణ సొంతంచేసుకుందన్నారు. ఉద్యమనాయకుడే రాష్ట్రసారధియై బంగారు తెలంగాణ కోసం అహర్నిషలు కృషిచేస్తున్నరని చెప్పారు. టీయారెస్ ప్లీనరీ సందర్భంగా పదిజిల్లాల నుంచి వచ్చిన నేతలకు ఆహ్వానోపన్యాసం చేసారు ఎమ్మెల్సీ పల్లా.

సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలేనని చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి తుమ్మల స్వాగతోపన్యాసం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించిందని ఎంపీ కే.కేశవరావు కొనియాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇందులో భాగంగానే వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అనతి కాలంలో అందరి మెప్పు పొందాయన్నారు.

అటు తెలంగాణ ఉద్యమ చరిత్రపై అద్భుత పరిజ్ఞానంతో సీఎం కేసీఆర్ ప్రశంసలు పొందిన చిన్నారి శ్రీజ టీఆర్ఎస్ ప్లీనరీకి విచ్చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా ఆ చిన్నారిని వేదికపైకి ఆహ్వానించారు. స్టేజ్ పైకి వచ్చిన శ్రీజ.. పలువురు మంత్రులను పలకరించింది. సీఎం కేసీఆర్ కూడా కొద్దిపేపు ఆ చిన్నారితో ముచ్చటించారు.