ఖమ్మం జిల్లాలో పండగలా చెక్కుల పంపిణీ

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్‌
ఖమ్మం,మే9(జ‌నం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ, పాస్‌పుస్తకాల అందచేతకు   రంగం సిద్దం అయ్యింది. 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రారంభమవుతున్న చెక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని ఓ పండుగలా నిర్వహించనున్నారు. జిల్లాలో మంత్రి తుమ్మలతో పాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పండగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. రైతుబంధు చెక్కులు, పట్టాదార్‌పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని జిల్లాకలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.  రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని, రైతులకు పెట్టుబడి సాయం అందించడం దేశంలోనే మొదటి సారి అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు.  రైతులకు చేదోడువాదోడుగా ఉండేలా రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతులు ఎవరి విూద ఆధారపడి జీవించకుండా వ్యవసాయం చేసుకోవాలనే ఆశయంతో భూ ప్రక్షాళన చేపట్టిందన్నారు. అనుకున్న విధంగా పట్టాదారు పాస్‌పుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. రైతులు వ్యవసాయ సాగులో పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి నష్టపోకుండా ఉండేందుకు బృహత్తర ఆలోచన చేసి ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలను పెట్టుబడి సాయంగా అందించేందుకు రైతుబంధు పథకాన్ని రూపొందించారన్నారు. అన్ని మండలాల్లో ఈ పంపిణీని ఒకేసారి ప్రారంభిస్తామన్నారు.
——-