ఖమ్మం విద్యార్థి అద్భుత ప్రతిభ..
ఖమ్మం : సాధించాలన్న తపన ఉండాలే కానీ.. సాధ్యం కానిది ఏదీ లేదంటున్నాడు ఓ బాలుడు. కార్పొరేట్ స్కూల్స్ లోనే కాదు… ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రతిభకు కొదవ లేదంటున్నాడతను. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. జశ్వంత్. ఖమ్మం జిల్లాలోని తల్లంపాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. నిత్యం ఏటీఎంలను పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లడం లాంటి వార్తలను చూసిన ఈ బాలుడు… దీని నివారణ కోసం ఏదైనా చేయాలని భావించాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం… ఫుల్లీ ప్రొటెక్టడ్ ఏటీఎంను తయారుచేశాడు. ఎవరైనా బలవంతంగా ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నిస్తే ఆటోమెటిక్‌గా మెయిన్‌డోర్ లాక్ అవుతుందని.. వెంటనే బ్యాంక్ సిబ్బందికి సమాచారం వెళ్లడమే కాకుండా… సైరన్ మోగి స్థానికులను అప్రమత్తం చేస్తుందని జశ్వంత్ అంటున్నాడు.ఇక జశ్వంత్ ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్ధులు గర్వంతో ఉప్పొంగుతున్నారు. కార్పొరేట్ స్కూల్ విద్యార్ధులకు తీసిపోని విధంగా తమ స్కూల్ విద్యార్ధి ప్రతిభ చాటడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగే పాఠశాల ప్రదర్శనలో ఈ పరిజ్ఞానంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రదర్శిస్తామని ఉపాధ్యాయులంటున్నారు. జశ్వంత్‌లాంటి వారిని ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్ధుల్లో మానసిక స్థైర్యం పెరుగుతుందంటున్నారు.
చేయాలనే పట్టుదల ఉండాలే కానీ.. పల్లెటూరు అయినా పట్నం అయినా ఒక్కటే అని చెప్పడానికి జశ్వంత్ ప్రదర్శిస్తున్న ప్రతిభే నిదర్శనం. జశ్వంత్ ప్రతిభను ఆదర్శంగా తీసుకుని మరెంతమందో ఇలాంటి ఆవిష్కరణలు రూపొందించాలని ఆశిద్ధాం.