ఖరీదైన ఖైదీ కసబ్ రక్షణకే రోజూ లక్షల ఖర్చు విచారణలో మలుపులెన్నో
ముంబై, నవంబర్ 21 :భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ ¬మం సృష్టించిన అజ్మల్ అవిూర్ కసబ్ విచారణ, ఉరితీత అమలు ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. భారత్‌పై దండెత్తిన ఉగ్రవాదుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక వ్యక్తిగా, అత్యంత ఖరీదైన ఖైదీగా కసబ్ గుర్తింపు పొందాడు. ఆయన రక్షణ కోసం ప్రత్యేకంగా జైలు, కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దేశంలో ఉగ్రవాద దాడులకు సంబంధించి అత్యంత వేగంగా తీర్పు వెలువడిన కేసు ఇదే. అత్యంత ఖరీదైన కేసు కూడా ఇదే. అలాగే, ఈ కేసులో అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ సహకరించడం, భారత న్యాయస్థానానికి హాజరు కావడం కూడా ఇదే ప్రథమం. కసబ్ అత్యంత ఖరీదైన ఖైదీగా గుర్తింపు పొందాడు. ఈ ఉగ్రవాది కోసం ప్రత్యేక జైలును కేటాయించాల్సి వచ్చింది. కసబ్ రక్షణ కోసం రోజూ రూ.8 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ జైలుకు 200 మంది ఇండో-టిబెటన్ పోలీసులతో భద్రత కల్పించారు. ఇందకోసం ఇప్పటివరకు రూ.22 కోట్ల వరకు ఖర్చు చేశారు. ముంబై ఆర్థర్ రోడ్ జైలు రక్షణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. బుల్లెట్ ప్రూఫ్ సెల్‌ను ఏర్పాటు చేసింది. అతన్ని విచారించేందుకు ఇక్కడే ప్రత్యేక ట్రయల్ కోర్టు ఏర్పాటైంది.
కసబ్ వెర్రీవేషాలు…
ఇక కసబ్ విచారణలో వేసిన వేషాలకు లెక్క లేదు. ముంబై దాడులతో తనకు సంబంధం లేదని, ఏకే 47 అంటే ఏమిటో తెలియదని, దాన్ని ఎలా పేలుస్తారో అంతకన్నా తెలియదని న్యాయమూర్తి ఎదుట వాదించాడు. పైగా సినిమాల్లో నటించడానికే వచ్చానని బుకాయించాడు. భారత న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసేలా మాట్లాడాడు. జైల్లో అతగాడి ఆగడాలైతే మరీ శృతి మించేవి. తనకు బిర్యానీ కావాలని, బాలీవుడ్‌లో నటించాలని ఉందంటూ వెకిలిగా ప్రవర్తించే వాడు. తాను మైనర్‌నని, తనపై మత్తు మందు ప్రయోగించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేశారని ఆరోపించాడు. గతేడాది జూలైలో తాను నేరం చేసినట్లు న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. ముంబై దాడుల కోసం పాకిస్తాన్‌లోనే కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడు. వ్యూహరచన మొత్తం న్యాయమూర్తి ఎదుట పూసగుచ్చినట్లు వివరించాడు. ఆ తర్వాత మళ్లీ తనకే పాపం తెలియదని, భారత్‌పై జరిగిన దాడితో తనకు సంబంధం లేదని బుకాయించాడు. తాను మైనర్‌నని, తనపై మత్తు మందు ప్రయోగించి తప్పుడు వాంగ్మూలం నమోదు చేశారని ఆరోపించాడు. అయితే, ఆయన వాదనలన్నీ తప్పని అధికారులు నిరూపించారు. కసబ్ మేజరేనని, ఆయన ఎముకలకు నిర్వహించిన వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించారు. మరోవైపు, కసబ్ డీఎన్‌ఏ నమూనాల ద్వారా.. నాటి ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే మృతదేహంలో లభించిన బుల్లెట్లు కసబ్ తుపాకీ నుంచి వచ్చినవేనని స్పష్టమైంది. స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు లభించడంతో కసబ్‌కు మరణ శిక్ష ఖరారైంది.