గంభీర్‌కు నిరాశ


కోహ్లీకే కెప్టెన్సీ

పర్వేజ్‌ రసూల్‌

మొహిత్‌శర్మలకు పిలుపు

ముంబై ,జూలై 5 (జనంసాక్షి):

జింబాబ్వేలో పర్యటించే భారత క్రికెట్‌ జట్టును ప్రకటించారు. అందరూ ఊహించినట్టు గౌతం గంభీర్‌కు మాత్రం పిలుపు రాలేదు. సీనియర్లకు విశ్రాంతినివ్వాలని ముందుగానే నిర్ణయించడంతో యువక్రికెటర్లకు అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్‌ బౌలర్‌ పర్వేజ్‌ రసూల్‌ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 24 ఏళ్ళ ఈ స్పిన్నర్‌ గత కొంత కాలంగా డొమెస్టిక్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో 46 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఈ ఏడాది మార్చిలో ఆస్టేల్రియాతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ, ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఆకట్టుకున్నాడు. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బౌలర్‌ మొహిత్‌శర్మ కూడా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో అద్భుతంగా రాణించిన మొహిత్‌శర్మ 15 మ్యాచ్‌లలో 20 వికెట్లు పడగొట్టాడు. అటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కూడా అతని రికార్డు అద్భుతంగా ఉంది. 11 మ్యాచ్‌లలోనే 44 వికెట్లు తీసుకోవడం ద్వారా సెలక్టర్లను ఆకట్టుకు న్నాడు. వీరితో పాటు జయదేవ్‌ ఉనాద్కట్‌ కూడా జాతీయ జట్టులోకి వచ్చాడు. అలాగే గాయం నుండి కోలుకున్న చటేశ్వర పుజారా కూడా వన్డేలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ట్రై సిరీస్‌లో ఆడుతోన్న ఇశాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌తో పాటు బ్యాట్స్‌మెన్‌ మురళీ విజయ్‌కు విశ్రాంతినిచ్చారు. మిగిలిన ఆటగాళ్ళు మాత్రం జింబా బ్వే పర్యటనకు వెళ్ళనున్నారు. గంభీర్‌కు చోటు దక్కుతుందని భావించినా… సెలక్టర్లు మరోసారి అత న్ని పక్కనపెట్టారు. ప్రస్తుతం నిలకడగా రాణిస్తోన్న ధావన్‌-రోహిత్‌శర్మల జోడీని మార్పు చేయకూడదని భావించడంతో గంభీర్‌కు నిరాశే మిగిలింది. కాగా ట్రై సిరీస్‌ ముగిసిన వారం రోజుల్లో భారత జట్టు జింబాబ్వే పర్యటనకు బయలుదేరనుంది. ఐదు వన్డేల సిరీస్‌ జూలై 24 నుండి ప్రారంభం కానుంది.

భారత జట్టు :

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌శర్మ, దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌ కీపర్‌), చటేశ్వర పుజారా, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, అజంక్యా రహానే, రవీంద్ర జడేజా, అమిత్‌మిశ్రా, పర్వేజ్‌ రసూల్‌, మహ్మద్‌ షవిూ, వినయ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, మొహిత్‌శర్మ.