గజ్వెల్‌లో ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం
సిఎం ఏతుల విూదుగా ప్రారంబించేందుకు సన్నాహాలు
పండుగలా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు : కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
సిద్దిపేట,జూలై24(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్ సవిూక్షించగా, మంత్రి హరీస్ రావు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కనీవిని ఎరుగని విధంగా చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిద్దామని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఇంట్లో శుభకార్యం కన్నా ఉత్సాహంగా గొప్పగా, బాధ్యతాయుతంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటగానే అదే సమయంలో అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే విధంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం క్లస్టర్ల వారీగా అధికారులతో మాట్లాడారు. గజ్వేల్‌లో ఇప్పటికే వివిధ రంగాల్లో అభివృద్ధి ఊహించని విధంగా జరిగిందని వీటికి తోడు పచ్చదనంతో గజ్వేల్ కళకళలాడితే పట్టణ వాతావరణ పరిస్థితులు మారడంతో పాటు భావితరాలకు మేలు కలుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దీంట్లో అధికారులు పూర్తిస్థాయిలో బాధ్యతయుతంగా వ్యవహరించి పట్టణంలోని ప్రతివ్యక్తినీ భాగస్వామిని చేసేలా చూడాలని కోరారు. ఒకేరోజు మొక్కలు నాటే
కార్యక్రమం పూర్తికావడానికి ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎనిమిది క్లస్టర్‌లలో ముందుగా నిర్ణయించిన ప్రకారం మొక్కలు నాటే ప్రాంతాలను ఎంపిక చేసి గుంతలు తీసి సిద్ధం చేసుకోవాలన్నారు. పట్టణంలో నాటిన మొక్కలు సంరక్షించే బాధ్యత కూడా పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా నిర్వర్తించడానికి వారిలో క్లస్టర్ బృందాలు అవగాహన కల్పించాలన్నారు. ఒక్క మొక్క కూడా వృథా పోకుండా నాటిన మొక్కలన్నీ పెరిగే విధంగా చర్యలు చేపట్టేందుకు ఆయా ప్రాంతవాసులకు తగిన అవగాహన కల్పించాలన్నారు. ఏడాదిలోపు గజ్వేల్ పట్టణం హరితవనంగా మారాలని మంచి వాతావరణం పట్టణ ప్రజలకు అందేవిధంగా మార్పు తీసుకువచ్చే బాధ్యత చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు భాగస్వాములైతే మొక్కల సంరక్షణ పై వారికి మంచి అవగాహన కలుగుతుందని తప్పనిసరిగా ప్రతి ఇంటింటికీ వెళ్లి 15 నిమిషాలు కుటుంబసభ్యులతో మొక్కలు నాటడం, సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. గజ్వేల్‌లో నాటిన మొక్కలు భావితరాలకు ఉపయోగకరంగా మారడమే కాకుండా దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో మనందరం పాల్గొనే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రచారం ప్రారంభంక్లస్టర్‌ల వారీగా మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతల్లో పట్టణ ప్రజలు, ప్రముఖులు, నాయకులు, విద్యార్థులు, మహిళలు, యువకులు భాగస్వాములయ్యేందుకు ప్రచారాన్ని ఏర్పాటు చేశారు. ఆటోలకు హరితహారం ఫ్లెక్సీలు పెట్టి మైక్ సెట్లు బిగించి పట్టణంలోని అన్ని వార్డుల్లో శుక్రవారం నుంచి ప్రచారం ముమ్మరం చేశారు. మొక్కలు నాటడం వాటి వల్ల జనజీవనానికి సమకూరే సత్ఫలితాలపై పాటలు, నినాదాలు, ప్రసంగాలతో కూడిన ప్రచారాన్ని చేపట్టారు.