గద్వాల జిల్లాకోసం భారీ ర్యాలీ
– పట్టువదలని నడిగడ్డ బిడ్డలు
మహబూబ్‌నగర్,ఆగస్టు 30(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం పాలమూరులో ఆందోళనకు గురి చేస్తోంది. గద్వాల కోసం అఖిలపక్షనేతలు ఆందోళనలు, బంద్‌లతో ఉద్యమిస్తున్నారు. చారిత్రక గద్వాలను జిల్లా చేయాలని కోరుతున్నారు. గద్వాల కోసం మాజీమంత్రి డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ తదితరులు పోరాడుతున్నారు. ఓ వైపు అభిప్రాయాలు స్వీకరిస్తూనే మరోవైపు కొత్తగా ప్రకటించిన జిల్లాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా దసరా నుంచి పరిపాలన ప్రారంభించేందుకు తాత్కాలికంగా పాత భవనాలను తీసుకోనున్నారు. నాగర్‌కర్నూలులో ఇప్పటికే ఉన్న కార్యాలయాల భవనం, పంచాయతీరాజ్ శాఖ విశ్రాంతి భవనం పరిశీలనలో ఉన్నాయి. కలెక్టరేటును ఈ రెండింటిలో ఒకచోట ఏర్పాటు చేయనున్నారు. వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతున్న రాజాగారి బంగ్లాను కలెక్టరేటుకు పరిశీలిస్తున్నారు. పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని కూడా పరిగణలోకి తీసుకొంటున్నారు. ఇతర కార్యాలయాలకు పట్టణంలో ఉండే భారీ భవనాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు.
దసరా నాటికి ఆయా జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయడంలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. మహబూబ్‌నగర్‌కు ఇప్పుడున్న భవనాలే వినియోగించ నున్నారు. వనపర్తిలో కొత్త భవనాలు నిర్మించేందుకు స్థలాన్వేషణ కొనసాగుతోంది. నాగర్‌కర్నూలు శివారులో అసైన్డ్ భూములు అందుబాటులో ఉన్నాయి. భవన నిర్మాణాలు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న కోటలు, ప్రభుత్వ భవనాలను పరిపాలనకు వినియోగించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట కొలువుదీరేలా కొత్త జిల్లాల్లో నిర్మాణాలు ఉండబోతున్నాయి. దీనికోసం ఒక్కో కలెక్టరేటుకు కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో భూములు సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. అందులో వనపర్తి, నాగర్‌కర్నూలు పట్టణాల్లో అందుబాటులో ఉన్న భూముల వివరాలు పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలో భూముల లభ్యత అంతగా లేదని తేలినట్లు సమాచారం. దీంతో ఏంచేయాలనేదానిపై ఆలోచిస్తున్నారు. ప్రజలకు అన్ని రకాల సేవలు ఒకేచోటు నుంచి అందించాలన్న సంకల్పంలో భాగంగా సంయుక్త పరిపాలన భవన నిర్మాణాల ఆలోచన పుట్టుకొచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కలెక్టరేటుతోపాటు అన్నిరకాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. కొత్తగా వనపర్తి, నాగర్‌కర్నూలు కేంద్రాల్లొ భవనాలు నిర్మించడానికి దాదాపు 25 ఎకరాల చొప్పున స్థలాన్ని నిర్మాణాలకు కేటాయించనున్నారు. ఈ మేరకు స్థలాన్వేషణ ప్రారంభించారు. మరోవైపు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములను పరిగణనలోకి తీసుకున్నా ఒకేచోట పాతిక ఎకరాలు లభించడం కష్టంగా మారుతోంది. వనపర్తి పట్టణంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పట్టణ శివారుల్లోనూ ఒకేచోట అంత విస్తీర్ణంలో భూమి లభించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. దీంతో రెండు మూడు ప్రాంతాలను ఎంపికచేసి నిర్మాణాలను చేపట్టేందుకు నివేదిక తయారుచేసినట్లు సమాచారం.