గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత
రాహుల్ రాకతో మలినమైందంటూ ఎంపి సుమన్ శుద్ది
అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు
హైదరాబాద్,ఆగస్ట్14(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమకారులను చంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. రాహుల్ గాంధీ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి మలినం చేశారన్నారు. అందుకే పాలతో అమరుల స్థూపాన్ని శుద్ధి చేశామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామంటున్న రాహుల్.. తెలంగాణ హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ నేతలు రాహుల్‌తో అబద్దాలు మాట్లాడించారని ధ్వజమెత్తారు. ఏపీలో కాంగ్రెస్‌ను నిలబెట్టడం కోసం రాహుల్ గాంధీ.. చంద్రబాబు వద్ద కాంగ్రెస్‌ను తాకట్టుపెట్టారన్నారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని సుమన్ జోస్యం చెప్పారు. అయితే సుమన్ చర్యతో గన్‌పార్క్ దగ్గర ఉద్రికత్త నెలకొంది. రాహుల్‌గాంధీ నివాళితో అమరవీరుల స్థూపం మలినమైందంటూ ఎంపీ సుమన్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ విద్యార్ధి విభాగం నాయకులు పాలాభిషేకం చేసేందుకు యత్నించారు. అక్కడే ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.