గల్ఫ్‌కు వెళ్లి దుబాయ్‌లో చిక్కి
21 ఏళ్ల తరవాత స్వగ్రామానికి చేరిక
జగగిత్యాల,జూలై23(జనంసాక్షి): ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 21 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు క్షేమంగా చేరడంతో అతని కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి కృషితో అతను ఇక్కడకు చేరుకున్నాడు. బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి వీసా లేకుండానే బోర్డర్ దాటి పక్క దేశమైన దుబాయ్ లోకి ప్రవేశించి అష్టకష్టాలు పడ్డాడు. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం కమ్మరిపేటకు చెందిన వొల్లెం గంగరాజం అనే కార్మికుడు 21 సంవత్సరాల క్రితం.. బతుకు దెరువు కోసం గల్ఫ్ కు వెళ్లాడు. వీసా లేకుండానే బోర్డర్ దాటి పక్క దేశమైన దుబాయ్ లోకి ప్రవేశించాడు. కానీ.. సరైన వీసా, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. ఎక్కడా పని దొరకలేదు. ఏమో చేయాలో తోచలేదు. అల్కోస్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ.. కడుపు నింపుకొనేవాడు. చాలాకాలం పాటు అక్కడే ఉండిపోయాడు. తన క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు కూడా చెప్పలేకపోయాడు. దీంతో అతని కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పని లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి వసతి లేక.. ఇంటికి వెళ్దామంటే పాస్ పోర్టు లేక.. గంగరాజం దుర్భర జీవితం గడిపాడు. నాలుగేళ్లుగా వాటర్ ట్యాంకర్ కింద, బస్సుల కింద, గోడల పక్కన నిద్రిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. అతను పడుతున్న కష్టాలను అక్కడున్న తెలుగు వారు చూశారు. ఈ విషయం గల్ఫ్ కార్మికుల రక్షణ సమితికి తెలియచేశారు. దీంతో ప్రతినిధులు గుండల్లి నర్సింహా, శేఖర్ గౌడ్ లు స్పందించారు. అతడిని జగిత్యాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు. దుబాయిలోని ఇండియన్ కౌన్సిలేట్ అధికారులకు, దుబాయి పోలీసు అధికారులకు విషయాన్ని తెలియచేశారు. 11 నెలలుగా గంగరాజంను ఇండియాకు పంపించేందుకు ప్రయత్నాలు జరిగాయి. గంగరాజం ఇండియాకు వెళ్లేందుకు వీలుగా అవుట్ పాస్ పోర్టును భారత రాయబార కార్యాలయ అధికారులు ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు హైదరాబాద ఏయిర్ పోర్టుకు గంగారాజం చేరుకున్నారు. అతడిని చూసిన కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. గంగరాజం దుబాయికి వెళ్లేముందు ఆయన కొడుకు వయస్సు ఏడాది వయస్సు. క్షేమంగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి సభ్యులకు గంగరాజం కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
……………