గల్ఫ్‌బాధితుల విషయంలో మాట మరిచిన ప్రభుత్వంఅప్పుల ఊబిలో గల్ఫ్‌ బాధితులు-ఏజెంట్ల మోసాలకు బలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ప్రతియేటా ప్రతికూల పరిస్థితులతో దాడి చేస్తున్న ప్రకృతి వికృత రూపానికి పల్లెలు అతలాకుతలం అవుతున్నాయి.ఓసారి అనావృష్టి, మరోసారి అతివృష్టి రూపంలో గ్రామీణులు ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. అధిక శాతం వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవించడంతో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. రైతు కుటుంబాలకు వ్యవసాయం కరువవుతోంది. ఫలితంగా బతుకు బరువవుతోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక ధరలు, నకిలీల మాయవల్ల అన్నదాతలు అతలాకుతలం అవుతున్నారు. దీంతో జీవించడానికి ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వాలు , పాలకులు కర్షకులపై చిన్నచూపు చూస్తున్నారు. స్వదేశంలోనే ఉపాధి కల్పిస్తామని చెప్పిన నేతల మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా ఏడుపుమయమైన తమ జీవితానికి ఏడారి దేశమే దిక్కని భావిస్తున్నారు. ఒక్కొక్కరంగా ఆశలు రెక్కలు కట్టుకుని ఆకాశమార్గంలో విహరిస్తున్నారు. అయితే గల్ఫ్‌ అనే మాయాప్రపంచం తమనెంత మాయ చేస్తుందో అక్కడికెళ్లిన తర్వాతగానీ గ్రహించడం లేదు. గ్రామీణ ప్రజల గల్ఫ్‌ వలసలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధి హమీ పథకంతో వలసలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గల్ఫ్‌ బాధితులను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం మాట మరిచింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గల్ఫ్‌ బాధితుల కోసం నిర్వహించిన జాబ్‌మేళాలు రాజకీయలభ్ది కోసం మాత్రమే ఉపయోగపడ్డాయని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే స్థానికంగా కనీస ఉపాధి లేకపోవడం, వ్యవసాయం పెనుభారంగా మారడంతో పల్లె ప్రజలు ఎడారి దేశంవైపు పయనమవుతున్నారు. వీరి అవసరాన్ని గ్రహించిన ఏజెంట్లు మాయమాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. వేల రూపాయలు అప్పులు చేసి ఆకాశమార్గం వైపు ఆకర్షితులవుతున్నారు. దుబాయ్‌,ఖతర్‌, సౌదీ,మలేషియా, అబుదాబి వంటి దేశాలలో అనేకమంది జీవనోపాధి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఇందులో చదువుకున్న యువకులే అధికంగా ఉండడం బాధాకరం. చాలీచాలని వేతనాలను చెల్లిస్తున్న అక్కడి యాజమాన్యాలు వలస జీవులను బలి పశువులుగా వాడుకుంటున్నాయి. ఏజెంట్ల మాయమాటలకు మోసపోయిన అనేక మంది గల్ఫ్‌ దేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా అప్పు చేసి ఏజెంట్ల చేతిలో పోసిన రుణం తీర్చడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు. భార్యా, పిల్లలకు దూరంగా అయిన వారందరినీ వదిలిపెట్టి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని కలలు గన్న అనేక మంది గల్ఫ్‌ బాధితుల కల కలగానే మారుతుంది. ఎడారి దేశానికి ఎగిరిపోవాలనే ఆకాంక్ష ఉన్న వలస పక్షులను గుర్తించేందుకు చిన్నా, చితక ఎజెంట్లు  పుట్టగొడుగుల్లా పల్లెల్లో పుట్టుకొస్తున్నారు. వారికి మాయ మాటలు చెప్పి వారిని ఆకర్షితులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచి కంపెనీలో ఉన్నతమైన వేతనం ఉందంటూ నమ్మబలుకుతున్నారు. చివరికి ఆశావాహులను రెక్కల గుర్రం ఎక్కిస్తున్నారు. కానీ ఇక్కడ ఎజెంటు చెప్పిన మాటలకు గల్ఫ్‌ దేశాలలో చేసే పనికి ఎలాంటి పొంతన కుదరడం లేదు. కనీస వేతనం కనిష్టంగా ఉండడంతో పూటగడవడమే కష్టతరంగా మారుతుంది. మోసపోయామని గ్రహించి ఎవరికీ చెప్పుకోలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి, పగలు కష్టపడి కుటుంబ క్షేమం కోసం పరితపిస్తున్నారు. ఇలా ఏజెంట్ల మాయమాటలకు మోసపోయి స్వదేశానికి తిరిగి వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిలో కొందరు ధైర్యం చేసి ఏజెంట్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ పోలీసులనుఆశ్రయించినవారు కూడా ఉన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏజెంట్ల మోసాలకు  అడ్డుకట్ట వేయలేకపోతోంది. పేద ప్రజల కన్నీటి కష్టాలు పాలకులకు కనిపించలేకపోతున్నాయి. ప్రవాసాంధ్రుల కోసం కెబినెట్‌లో ప్రత్యేకశాఖను ఏర్పాటు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం పెద్దల మాటలు నీటిమూటలుగానే మిగిలాయి.ఇటు ఏజెంట్ల మోసానికి అటు గల్ఫ్‌ వలసలకు నియంత్రణ కరువవడంతో అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఉపాధి మార్గాలతో వలసలను నియంత్రిస్తామని పాలకులు స్పష్టమైన హమీ ఇచ్చారు. కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఏజెంట్ల మోసాలపై కూడా చర్యలు శూన్యమవడంతో అర్హత లేని వారు కూడా అరంగేట్రం చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా ఏజెంట్ల మోసాలకు, అడ్డుకట్ట వేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. గల్ఫ్‌ దేశాలలోఉండే కంపెనీల పూర్తి వివరాలు ఖచ్చితమైన కనీస వేతనం ఇప్పించే విధంగా ఏజెంట్లు పని చేయాలని  సూచిస్తున్నారు. స్వలాభం కోసం ఇతరులను బలిచేసే ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇందులో మార్పు రాదని బాధితులు గుర్తు చేస్తున్నారు.