గవర్నర్‌కు వ్యతిరేకంగా డిఎంకె నిరసన

స్టాలిన్‌ అరెస్ట్‌

చెన్నై,జూన్‌23(జ‌నం సాక్షి): తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌కు వ్యతిరేకంగా నిరసనకు దిగిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు డిఎం.కె.స్టాలిన్‌ను పోలీసులు శనివారంనాడు నిర్బంధించారు. డీఎంకే కార్యకర్తల అరెస్టుకు నిరసనగా స్టాలిన్‌ నమక్కల్‌లో నిరసనకు దిగారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ప్రవర్తిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ‘ఇందిరాగాంధీతో పాటు ఎందరో నేతలకు గతంలో డీఎంకే నల్లజెండాలతో నిరసన తెలిపింది. అయితే ఏరోజూ కార్యకర్తలను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. గవర్నర్‌ రాజీనామా చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వంపై కూడా స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే వారు గవర్నర్‌ను వ్యతిరేకించడం లేదని అన్నారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శుక్రవారంనాడు తిరుచ్చిలో 192 మందికి పైగా డీఎంకే కార్యకర్తలు నల్లజెండాల ప్రదర్శనతో నిరసన తెలిపారు