గవర్నర్‌ కోశ్యారీతో ఉద్దవ్‌ థాక్రే దంపతుల భేటీ

ముంబయి,నవంబర్‌27 (జనంసాక్షి )  : శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే, ఆయన భార్య రశ్మి ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ థాకరేకు గవర్నర్‌ కోశ్యారీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 28న సాయంత్రం 6:40 నిమిషాలకు మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్‌ థాకరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్కులో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం అభ్యర్థి ఉద్ధవ్‌ థాకరేనే అని తెలుపుతూ.. గవర్నర్‌కు లేఖ అందజేశారు. పడ్నవీస్‌ తప్పుకోవడంతో మహారాష్ట్రలో శివసేన -ఎన్సీపీ -కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఫడ్నవీస్‌ వైదొలిగిన కొద్దిగంటల్లోనే సమావేశమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ‘మహా వికాస కూటమి’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రే (59)ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఠాక్రే పేరును ఎన్సీపీకి చెందిన జయంత్‌ పాటిల్‌ ప్రతిపాదించగా, కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ బలపర్చారు.