గవర్నర్‌ చర్య రాజ్యాంగ విరుద్ధం

– బీజేపీ వ్యక్తిగా వ్యవహరించారు
– తమ వాదనను వినే అవకాశాన్ని కల్పించలేదు
– వారం గడువు అడిగితే అవిశ్వాసానికి 15రోజులు గడువు ఇచ్చారు
– సుప్రింకోర్టు తీర్పు వారికి చెప్పపెట్టు
– విలేకరుల సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ఆశ్రిత పక్షపాతం ప్రదర్శించరాదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య అన్నారు. శుక్రవారం కేపీసీసీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తామే ముందుగా గవర్నర్‌కు లేఖ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బల నిరూపణకు ఈ విధంగా ఎక్కువ కాలం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌-జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, దానిని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్న, మెజారిటీ ఉన్న పార్టీల కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఇటీవలి గోవా పరిణామాలే ఉదాహరణ అని తెలిపారు. కానీ గవర్నర్‌ వజుభాయ్‌ వాలా సరైన విధానాన్ని అనుసరించలేదని ఆరోపించారు. అవసరమైన అన్ని పత్రాలను తాము (జేడీఎస్‌, కాంగ్రెస్‌) సమర్పించినప్పటికీ గవర్నర్‌ పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ పాత్ర చాలా కీలకమని సిద్ధరామయ్య అన్నారు. గవర్నర్‌ తప్పనిసరిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కానీ కర్ణాటకలో మాత్రం బీజేపీకి అనుకూలంగా గవర్నర్‌ నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అమిత్‌ షా, నరేంద్ర మోదీ చెప్పినట్లుగా గవర్నర్‌ వజుభాయ్‌ నడుచుకుంటున్నారన్నారు. గవర్నర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. బల పరీక్షకు యడ్యూరప్ప వారం గడువు అడిగితే, గవర్నర్‌ 15 రోజుల గడువు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాగా సుప్రింకోర్టు తీర్పుతో తమకు జరగాల్సిన న్యాయం జరిగినట్లయిందన్నారు. ఇప్పటికైన గవర్నర్‌ స్థాయి వ్యక్తులు తమ పరిధిలకు లోబడి పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సిద్ధిరామయ్య హితవు పలికారు.