గాజాపై బాంబుల వర్షం
` వైమానిక దాడులతో నగరం ధ్వంసం
` 6 వేల బాంబులతో ఇజ్రాయెల్ ముప్పేట దాడి
` ఇప్పటి వరకు 1500 మందికి పైగా మృతి
` భారీ ఆపరేషన్‌కి సిద్ధమైన ఇజ్రాయెల్
` హెచ్చరికల నేపధ్యంలో గాజాను వీడుతున్న ప్రజలు
` యుద్ధం మరింతగా విస్తరించే అవకాశం
` వైట్ పాస్పరస్‌తోనూ అటాక్ !
జెరుసలాం(జనంసాక్షి): రాకెట్లతో హమాస్ దాడి చేసిన నేపథ్యంలో.. ఇజ్రాయిల్ కౌంటర్ అటాక్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేసింది. అయితే గత శనివారం నుంచి జరుగుతున్న దాడుల్లో సుమారు ఆరు వేల బాంబులను వాడినట్లు తెలుస్తోంది. కేవలం గాజాపైనే ఆరు వేల బాంబులు వేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఆ బాంబులు దాదాపు 4వేల టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది. గాజాలో ఉన్న హమాస్ ప్రాంతాలపై బాంబులతో ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. తమ వైమానిక దళం సుమారు 3600 టార్గెట్లను అటాక్ చేసినట్లు ఇజ్రాయిల్ వైమానిక దళం పేర్కొన్నది.హమాస్ ఆకస్మిక దాడులకు కౌంటర్ అటాక్ ప్రారంభించిన ఇజ్రాయిల్ వైఖరిపై మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తమ దాడుల కోసం ఆ దేశం వైట్ పాస్పరస్‌ను వాడినట్లు భావిస్తున్నారు. వివాదాస్పద వైట్ పాస్పరస్ మందును.. గాజా స్ట్రిప్‌తో పాటు లెబనాన్‌లో ఉన్న టార్గెట్లపై వాడినట్లు తెలుస్తోంది. చాలా వేగంగా అంటుకునే గుణం ఉన్న ఆ రసాయనాన్ని.. సాధారణంగా మిలిటరీ వాడుతుంది. వైట్ పాస్పరస్ వల్ల శరీరం కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆయుధంగా ఆ రసాయనాన్ని వాడితే ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి. జన సాంద్రత ఉన్న ప్రదేశాల్లో ఆ రసాయనాన్ని ఎక్కువగా వాడుతుంటారు. వైట్ పాస్పరస్ వాడడం లేదని ఇజ్రాయిల్ పేర్కొన్నా.. కొన్ని వార్తా సంస్థలు తీసిన ఫోటోల్లో ఆ రసాయనాన్ని వాడినట్లు అర్థమవుతోంది.గాజా, లెబనాన్‌లో వైట్ పాస్పరస్‌కు చెందిన బాంబులు పేలినట్లు ఉన్న కొన్ని ఫోటోలను మానవ హక్కుల సంస్థ రిలీజ్ చేసింది. ఆకాశంలో ఏర్పడిన తెల్ల మబ్బులకు చెందిన ఫోటోల ఆధారంగా వైట్ పాస్పరస్ రసాయనంతో దాడి జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆక్సిజన్‌తో కలిసినప్పుడు వైట్ పాస్పరస్ మండుతుంది. ఆ మంటతో తెల్ల పొగ కమ్ముకుంటుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ రసాయనాన్ని బ్యాన్ చేయలేదు. కానీ ఆ రసాయనం వల్ల మనుషులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో స్మోక్ అటాక్ కోసం వైట్ పాస్పరస్‌ను ఇజ్రాయిల్ వాడిరది.
దాడులు ఆపకపోతే ఇతర సరిహద్దుల్లోనూ యుద్ధం: ఇరాన్
గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆపకపోతే ఇతర సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావచ్చని ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్‌కు చెందిన హిబ్జుల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధంగా ఉందన్న సంకేతం ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హ్పస్సేన్ అమిరాబ్‌డొల్లాహియాన్ గురువారం సాయంత్రం బీరూట్‌కు చేరుకున్నారు. అక్కడ హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ ప్రతినిధులు, లెబనీస్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ దూకుడు, యుద్ధ నేరాలకు పాల్పడటం, ముట్టడి నేపథ్యంలో ఇతర సరిహద్దుల వద్ద వాస్తవ యుద్ధానికి దారి తీయవచ్చని అన్నారు.కాగా, ఇరాన్ విదేశాంగ మంత్రి హ్పస్సేన్ అమిరాబ్‌డొల్లాహియాన్ గురువారం తెల్లవారుజామున ఇరాక్‌ను సందర్శించారు. ఆ దేశ ప్రధాని మొహమ్మద్ షియా అల్`సుడానీతో సమావేశమయ్యారు. అనంతరం విూడియాతో మాట్లాడిన ఆయన అక్కడ కూడా ఇలాంటి ప్రకటన చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే ఆ దేశ ఇతర సరిహద్దుల్లో యుద్ధం ఆరంభమవుతుందని హెచ్చరించారు. మరోవైపు గాజాలోని హమాస్‌కు, లెబనాన్‌లోని హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతిస్తున్నది. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయంపై ఎలాంటి స్పష్టత లేదు.
(ఆపరేషన్‌తో భారీగా ప్రాణనష్టం
` ఇరుదేశాలతో మధ్యవర్తిత్వానికి సిద్ధమే
` ఇజ్రాయిల్ హెచ్చరికల నేపథ్యంతో పుతిన్ ఆందోళన
గాజా(జనంసాక్షి): ఇజ్రాయిల్-హమాస్ యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ సైన్యం గాజాపై గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తే భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆయన శుక్రవారం అన్నారు. నివాస ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించడం సంక్లిష్ట విషయమని, ఇది తీవ్రపరిణామాలకు దారి తీస్తుందని అన్నారు. ముఖ్యంగా పౌరుల ప్రాణనష్టం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భారీ దాడి చేశారు. ఈ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడుల్లో హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే గాజా ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్), ఆ ప్రాంతానికి నీరు, విద్యుత్, ఇంధనాన్ని కట్ చేశాయి. ఇజ్రాయిల్ భూతలం మీద భారీ ఆపరేషన్ చేపట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, 24 గంటల్లో ఉత్తర గాజాలోని ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. అయితే 1.2 మిలియన్ల జనాభా ఉన్న ఆ ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లడం అంత సులువైన విషయం కాదని ఐక్యరాజ్యసమితి చెప్పింది. ఈ ఆదేశాలను విరమించుకోవాలని ఇజ్రాయిల్ కి సూచించింది. ఇజ్రాయిల్ ఈ ప్రకటన తర్వాత పుతిన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.