గామాల్లో మౌలిక వసతులు కల్పించాలి
గుంటూరు, జూలై 17 : పట్టణంలో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని మాచర్ల, వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాచర్ల 22 వార్డులో బోరు నిర్మాణానికి పూజ నిర్వహించి ప్రారంభించారు. వీధిలైట్లు వెలగడం లేదని, చేతిపంపులు పని చేయడంలేదని స్థానిక మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మతులు నిర్వహించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎటువంటి నీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరైనట్టు తెలిపారు. వీటిని ఉపయోగించి నీటి ఎద్దడి తొలగించటానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఏడుకొండలు, యార్డు చైర్మన్ శ్రీను, తాడి వెంకటేశ్వరరెడ్డి, ప్రసాద్, బాబూసింగ్‌లు పాల్గొన్నారు.