గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు

 

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

-వ్యవసాయ, మార్కెటింగ్‌,CCI
అధికారులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం

 

రాజన్నసిరిసిల్లబ్యూరో అక్టోబర్ 18, (జనం సాక్షి).జిల్లాలో పత్తిరైతులకు గిట్టుబాటు ధర కల్పించటంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్కెటింగ్‌, సీసీఐ, వ్యవసాయాధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోనీ మినీ మీటింగ్ హల్ లో పత్తి కొనుగోలుపై వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రస్తుత సంవత్సరం వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జిల్లాలోని 5484 ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారన్నారు. దాదాపుగా 39,676 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేందుకు జిల్లాలోని వేములవాడలో మూడు ,ఇల్లంతకుంట లో రెండు, బోయినపల్లిలో ఒకటి మొత్తం 6 సీసీఐ కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో తెరిచామన్నారు.పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని పత్తి మిల్లుల్లో పనిముట్లు, పనితీరును, సదుపాయాలను విస్తృతంగా తనిఖీ చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. చిన్న, సన్నకారు, కౌలు
పత్తి రైతుల కు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు ధృవీకరణ చేయాలన్నారు. ఈ సందర్భంగా మద్దతు ధర గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ప్రస్తుత ఏడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌ పొడవు పింజ రకం పత్తికి రూ.6,380, మధ్యరకానికి రూ.6,280 నిర్ణయించిందని అన్నారు.
పత్తి రైతులు తాము పండించిన పత్తి తేమశాతం 8 నుండి 12 శాతం లోపు ఉంటేనే సిసిఐ వారు కొనుగోలు చేస్తారని తెలిపారు.
కాటన్ కార్పొరేషన్ ఇండియా నాణ్యత ప్రమాణాల ప్రకారం రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు.సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖిమ్యా నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ పవన్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరి కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి జిల్లా రవాణా అధికారి కొండలరావు, జిల్లా సహకార అధికారి బుద్ధ నాయుడు, అదనపు డి ఆర్ డి ఓ మదన్ మోహన్ ,సీసీఐ సిబ్బంది, పత్తి మార్కెట్‌ కార్యదర్శులు, పత్తి మిల్లు ట్రేడర్స్‌ పాల్గొన్నారు.