గుండెల్లో, తలమీద కాల్చి మరీ చంపారు!
దంతెవాడ : సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడంలో మావోయిస్టులు చాలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతం గుండా జవాన్లు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారో ముందుగానే పక్కా సమాచారం అందుకున్న మావోయిస్టులు.. ఆ దారిలోనే శక్తిమంతమైన మందుపాతర అమర్చి పేల్చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించినట్లు తొలుత కథనాలు వచ్చాయి.
కానీ, దాడికి గురైన జవాన్లను చూసిన తర్వాత సరికొత్త విషయాలు తెలిశాయి. మందుపాతర పేల్చిన తర్వాత జవాన్లు ఇంకా ఎక్కడ బతికుంటారోనన్న అనుమానంతో.. మావోయిస్టులు వాళ్ల తలమీద, గుండెల్లోను కాల్చారని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చెప్పారు. జవాన్లలో ముగ్గురు పేలుడు తర్వాత కూడా బతికే ఉన్నారని, కానీ ఆ తర్వాత వాళ్లను మావోయిస్టులు కాల్చేశారని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. బుల్లెట్ గాయాలు తగిలిన తర్వాత వాళ్లు బతికారో లేదో మాత్రం తమకు కూడా ఇంకా పూర్తిగా తెలియడం లేదని ఆయన అన్నారు.