*గురప్ప వాగుపై బ్రిడ్జి నిర్మాణం సత్వరమే చేపట్టాలి*

 డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్

మునగాల, అక్టోబర్ 01(జనంసాక్షి): తాడువాయి గ్రామ శివారులోని గురుప్పవాగుపై పొంగిపొర్లుతున్న వాగు మూలంగా ప్రజల ప్రయాణ రాకపోకలు అంతరాయం ఎదురవుతున్నాయని, సత్వరమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడారు. తాడ్వాయి వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం మూలంగా తాడువాయి గ్రామ ప్రజలతోపాటు తాడువాయి గ్రామం మీదుగా ప్రయాణం చేసే సుమారు 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. తాడువాయి, వెంకటరాంపురం, నేలమర్రి, బక్తాలపురం  మరికొన్ని గ్రామాల ప్రజలు నిత్యం తాడువాయి రోడ్డు మార్గం ద్వారా నియోజకవర్గ కేంద్రం, మునగాల మండల కేంద్రానికి రాకపోకలకు ఈ రోడ్డే ప్రధానమైనదన్నారు. బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడం, ఇటీవల కాలంలో కురుస్తున్న వరుస, భారీ వర్షాలు మూలంగా రోజుల తరబడి వాగు పొంగి ప్రవహించడం మూలంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రోజువారి పనులు అవసరాల కోసం వెళ్ళుటకు అవకాశం లేక సతమతమవుతున్న పరిస్థితి ఉన్నదని, శుభకార్యాలు వచ్చినప్పుడు పక్క గ్రామాల మీదుగా ప్రయాణం చేసి రావడం, ఆ రోడ్డు కూడా సరైన సౌకర్యాలు లేక బంధువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మూలంగా పొంగి ప్రవహిస్తున్న వాగును దాటుతున్న క్రమంలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకపోవడం జరిగిందని, స్థానికులు కాపాడబడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కోదాడ శాసనసభ్యులు, స్థానిక మండల ప్రజాప్రతినిధులు, తాడ్వాయి గ్రామాన్ని సందర్శించి, తాడువాయి గురుప్పవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళిక ప్రకటించాలని, లేనియెడల గ్రామ ప్రజలతో ఆందోళన చేపడుతామని, ప్రజా ప్రతినిధులను ఊళ్లోకి  రానివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాలువలో పడి కొట్టుకొని పోయి మరణించిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వాన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు, యువజన సంఘాల నాయకులు జిల్లేపల్లి శ్రీనివాస్, మాతంగి శోభన్ బాబు, ఎం.సైదులు, కోట వెంకన్న, కోట అంజి తదితరులు పాల్గొన్నారు.