గెలిపిస్తే పనులన్నీ పూర్తి చేస్తా: కొప్పుల

జగిత్యాల,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నియోజకవర్గంలో మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్ధుతానని ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.ధర్మపురి నియోజకవర్గంలో నాలుగేళ్లలో రూ.1200 కోట్ల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రజల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెండోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటే ప్రజలు మద్దతు పలికి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి గెలిపించాలనీ, మళ్లీ విజయం సాధిస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని అన్నారు. వివిధ గ్రామాల్లో ఆయన శనివారం ప్రజలను నేరుగా కలుసుకుని ప్రచారం చేపట్టారు. టిఆర్‌ఎస్‌నే ఆశీర్వదించాలని, కూటమి నాయకుల మాటలు నమ్మొద్దని అన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే ప్రభుత్వానికే మద్దతు తెలుపాలన్నారు. గత 70 ఏళ్ల సమైక్య పాలనలో రాష్ట్రంలో పాలించిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు మహాకూటమితో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు గ్రామాలకు వస్తున్నారనీ, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఎంత నష్టపోయారో అర్థం చేసుకోవాలన్నారు.