గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానం రూపొందించాలి

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): గ్యాస్‌ కేటాయింపులపై జాతీయ విధానాన్ని రూపొందించాలని, టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. గ్యాస్‌ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె. తారకరామారావు డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్యాస్‌ కేటాయింపులకు సంబందించి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రైవేటు సంస్థలకు లబ్ధిచేకూర్చే విధంగా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రకు మన గ్యాస్‌ సంపద తరలిపోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రత్నగిరి ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయింపులు నిలిచిపోయినా, ఇది తాత్కాలికమేనని భవిష్యత్తులో ప్రమాదం ముంచుకు రాకతప్పదని కేటిఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు గ్యాస్‌ను తాత్కాలికంగా నిలిపివేయడంతోనే కాంగ్రెస్‌ నేతలు సంకలు గుద్దుకుంటున్నారని, భవిష్యత్తులో ముంచుకొచ్చే ప్రమాదాన్ని వారు గుర్తించడం లేదని విమర్శించారు. గ్యాస్‌ కేటాయింపులపై మంత్రుల సాధికార బృందం నిర్ణయం తీసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై మేల్కొనాలని అన్నారు. రాష్ట్రంలోని గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రైవేటు సంస్థలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఎక్కువ ధరకు విద్యుత్‌ను అమ్ముకునే లాంకో, కొండపల్లి జిఎంఆర్‌ సంస్థలకు గ్యాస్‌ను కేటాయించడాన్ని ఆయన తప్పు పట్టారు. విద్యుత్‌ శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన షబ్బీర్‌ ఆలీ ఈ సంస్థలకు గ్యాస్‌ కేటాయించాలంటూ లేఖలు రాశారని ఆరోపించారు. ఈ సంస్థలకు వెంటనే గ్యాస్‌ కేటాయింపులు రద్దుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలోని విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లాంకో, జీఎంఆర్‌ సంస్థలకు గ్యాస్‌ కేటాయింపులు రద్దుచేసి దానిని తెలంగాణలోని నేదునూరు, శంకరపల్లి, విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మన రాష్ట్ర గ్యాస్‌ సంపదను కాపాడుకునేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జయపాల్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తమ విభేదాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కెటిఆర్‌ అన్నారు.