గ్యాస్ సిలఅఇండర్ పేలి కుటుంబానికి తీవ్రగాయాలు
గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు
కడప,ఆగస్ట్23(జనంసాక్షి): గ్యాస్ డెలివరీ బాయ్ నిర్లక్ష్యం.. ఓ కుటుంబాన్ని ప్రమాదపు అంచుల్లోకి నెట్టేసింది. గ్యాస్ లీకయ్యి అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురికి తీవ్రగాయాలయిన ఘటన సోమవారం కడప జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల పరిసర ప్రాంతానికి చెందిన కుటుంబం ఉపాధి నిమిత్తం రాజంపేట కు వలస వచ్చి అద్దె ఇంట్లో ఉంటుంది. షేక్ షావలి కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఇంట్లో అమర్చుకునే ప్రయత్నం చేశారు. గ్యాస్ డెలివరీ బాయ్ వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పలేదు. గ్యాస్ వాడకంలో సరైన అవగాహన లేకపోవడంతో రాత్రంతా గ్యాస్ ఆన్ లోనే ఉండి లీకవుతూనే ఉంది. ఉదయం లేచిన ఇంటివారు లైట్ ఆన్ చేయడంతో అగ్నిప్రమాదం జరిగింది. షేక్ షావలి, అతని భార్య షేక్ సోఫియా, పిల్లలు పైజల్, హనీఫ్ మన్సూర్ లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో షేక్ షావలి, మన్సూర్ ల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని కడప రిమ్స్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.