గ్రానైట్ విస్తరణ అవకాశాలకు పడని అడుగు
విస్తరించి వుంటే ఉపాధికి అవకాశాలు పెరిగేవి
సాకారం కాని ఉపాధి అవకాశలు
సిద్దిపేట,నవంబర్5(జనంసాక్షి): జిల్లాల పునర్‌విభజనతో కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేటలో ఉపాధి అవకాశాలకు అవకాశం ఉన్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పరిశ్రమలను విభిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వాటిని
ఆర్థికంగా బలోపేతం చేయడం, కొత్తగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటుందని భావించిన యువత భంగపడ్డారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గ్రానైట్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే 740 గ్రానైట్ లీజులు ఉన్నాయి. సగటున ఒక్కో లీజు విస్తీర్ణం మూడు హెక్టార్లు ఉంటుందని అంచనా. ఈ అవకాశాలను వినియోగించుకుని ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందిన భావించారు. ఈ నేపథ్యంలోనే వీటికి చేరువగా ఉండే సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఆర్థిక మండలి ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు ప్రకటనలు వెలువడ్డా పెద్దగా కార్యక్రమాలు చేయలేదు. అలాచేసివుంటే కనీసం కొంతమందికైనా ఉపాధి దక్కేది. సిద్దిపేట, జనగాం, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో గ్రానైట్ యూనిట్లు నెలకొల్పనున్నట్లు వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో టాన్, కాఫిబ్రౌన్, వరంగల్ జిల్లాలో నల్ల గ్రానైట్ నిక్షేపాలున్నాయి. వీటినే ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఈ గ్రానైట్‌కు జాతీయ, అంతర్జాతీయంగా పేరుంది. గల్ఫ్ దేశాలకు చక్కదిద్దిన…చైనా, యూరోపియన్ దేశాలకు ముడి గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. ముంబయిలోనూ ఇక్కడి గ్రానైట్‌కు ఎనలేని గిరాకీ ఉంది. దీంతో అవసరమైన భూముల సేకరణ, నమూనాలపై పరిశ్రమల శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిద్దిపేట సహా మెదక్, కరీంనగర్, జనగామ జిల్లాల్లో గ్రానైట్ యూనిట్లను ఏర్పాటు చేయించి భారీ సంఖ్యలో ఉద్యోగవకాశాలు కల్పించే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతుందని భరోసా ఇచ్చారు. గ్రానైట్ ఆర్థిక మండలిని ప్రధానంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న జిల్లా కావడంతో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటారని భావించినా పెద్దగా అడుగులు పడలేదు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి 250కి పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి.ఈ నేపథ్యంలో వీటి సంఖ్యను మరింతగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పడ్డ సిద్దిపేట, జనగామతో పాటు పాత జిల్లా మెదక్‌లోనూ పారిశ్రామికవేత్తలతో యూనిట్లు ఏర్పాటు చేయించనుందని ప్రచారం జరిగినా ఎందుకో పట్టాలకెక్కలేదు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని లీజుకిచ్చిన క్వారీల నుంచి ముడిగ్రానైట్ ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని పాలీష్ చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు.దీని వల్ల ఒక్కో జిల్లాలో వందల సంఖ్యలో ఉద్యోగఅవకాశాలు వచ్చే అవకాశం కలిగేది. కానీ పెద్దగా అవకాశాలు దక్కలేదు. నాలుగున్నరేళ్లలో సాకారం కాని పనులు మళ్లీ కొత్తగా వచ్చిన తరవాత చేస్తామని నేతలు ఇప్పుడు హావిూ ఇస్తున్నారు.