గ్రామాలను అబివృద్దిలో ముందుంచాలి: ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్,ఫిబ్రవరి15(ఆర్‌ఎన్‌ఎ): గ్రామాల సమగ్రాభివృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలని, అందుకు తనవంతుగా కృషి చేస్తానని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్ పథకాలతో సర్‌ంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హావిూని అమలు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్డు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.16లక్షలతో పంచాయతీ భవనాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. రూ.10లక్షలు శ్మశాన వాటికల నిర్మాణానికి మంజూరు చేస్తామని ప్రకటించారు.
ప్రతి రైతుకు 15 రోజుల్లోగా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఏప్రిల్ నెల చివరిలో అందించే రైతుబంధు పథకంలో ఎకరాకు రూ.ఐదు వేలు అందిస్తామన్నారు. పెంచిన ఆసరా పింఛన్లను ఏప్రిల్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. మండలంలో ప్రతి నిరుపేదకు డబుల్‌బెడ్రూం మంజూరు చేస్తామని, మార్చి నెల చివరి వరకు ఇంటింటికి తాగు నీరు అందిస్తామన్నారు.