గ్రామాల్లో జోరుగా టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఊరూరా ప్రచారం చేస్తున్న నేతలు

నిజామాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): పల్లెలో పార్టీల ప్రచార జోరు పెరిగింది. అన్ని పార్టీలు సందడి సందడిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి, గడపగడపకూ తిరుగుతూ తమనే గెలిపించాలంటూ అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నియోజకవర్గాల్లో అన్ని పార్టీల ప్రచార సందడి కనిపించింది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరువిూద ఉన్నారు. ఇప్పటికే పల్లె పల్లె, గడపగడప చుట్టి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు.. ప్రజలతో మమేకమవుతూ, ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సవిూపిస్తున్న కీలక సమయంలో పార్టీ అధినేత, ఉద్యమ దళపతి కేసీఆర్‌ స్వయంగా నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించడం, ఆయా నియోజకవర్గ పార్టీ శిబిరంలో వెయ్యేనుగుల బలాన్ని నింపుతున్నది. రెట్టించిన ఉత్సాహంతో గులాబీ శ్రేణులు కార్యరంగంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఆర్మూర్‌ సభ సక్సెస్‌తో నయాజోష్‌లో ఉన్న గులాబీ దళం మరింత దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నది. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్‌ మండలం అవిూనాపూర్‌, లక్కోర, బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌, చిట్టాపూర్‌లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి గ్రామాల్లో పర్యటించారు. బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోటీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ షకీల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మహిళలు, యువకులు వృద్ధులను కలుస్తూ వారు చెప్పే సమస్యలను విన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగడానికి మరోసారి టీఆర్‌ఎస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాన్సువాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలను కలుస్తూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అఖండ మెజార్టీని ఇచ్చి కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.