గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులను  ఆదేశించారు.
బుధవారం రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ), మెప్మా అధికారులతో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను తప్పనిసరిగా భాగస్వామ్యం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల గురించి తమకు సమాచారం ఉండడం లేదని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, ఇది సరైన పద్ధతి కాదని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులను విధిగా భాగస్వామ్యం చేయాలని, తద్వారా వారు మహిళా సంఘాల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి వివరిస్తూ మహిళలకు మరింత అవగాహన పెంపొందింపజేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇకనుండి ప్రభుత్వ పరంగా చేపట్టే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా ప్రజాప్రతినిధులకు ముందస్తుగానే తెలియజేయాలని, వారి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని,  భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం సిద్దించగా, తెలంగాణ ప్రాంతం మాత్రం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుండి ప్రజాస్వామిక పాలనలోకి వచ్చిందన్నారు. ఇది జరిగిన 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలలో వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ విజయవంతం చేయాలని మంత్రి కోరారు. 16వ తేదీన అన్ని శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన మీదట, బహిరంగ సభలో వజ్రోత్సవాల ప్రాధాన్యతను, తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి వక్తలు వివరిస్తారని అన్నారు. 17వ తేదీన హైదరాబాద్ లోని బంజారా హీల్స్ రోడ్డు నెం.10 లో రెండు ఎకరాలలో 53 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కొమరం భీమ్ భవనం, సేవాలాల్ బంజారా భవనలను   ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవం చేస్తారని, అనంతరం యన్.టి.ఆర్. స్టేడియంలో  బహిరంగ సభలో సందేశం ఇస్తారని తెలిపారు.  జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఎస్టీలను బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలించాలని తెలిపారు. సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సమీక్ష సమావేశంలో శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక జైన్, పిడి డీఆర్డీఏ ప్రభాకర్, సంబంధిత అధికారులు, పిడి డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.